త్వరలో కోత విధించిన వేతన బకాయిల చెల్లిస్తాం
డిసెంబర్ 30లోపు తుపాను బాధిత రైతులకు పరిహారం
కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి
అమరావతి: కరోనా కారణంగా ఉద్యోగులకు కోత పెట్టిన వేతనాలను డిసెంబర్, జనవరి నెలల్లో చెల్లింపులు చేయనున్నట్లు ఏపీ మంత్రి కన్నబాబు తెలిపారు. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు చెప్పారు. కోత విధించిన వేతనాలకు రూ.2,324 కోట్లు, పింఛనుదారులకు రూ.482 కోట్ల చెల్లింపులు చేస్తామన్నారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. నివర్ తుపాను ప్రభావంపై కేబినెట్లో చర్చించామని.. బాధిత రైతులను ఆదుకోవాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. తుపానుతో రాష్ట్రంలో 30వేల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 1300 ఎకరాల్లో వాణిజ్య పంటలకు నష్టం జరిగిందన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 289 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించారు. సుమారు 10వేల మందికి పైగా బాధితులను పునరావాస శిబిరాలకు తరలించామన్నారు. ఆయా శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 చొప్పున సాయం అందించాలని సీఎం ఆదేశించినట్లు కన్నబాబు తెలిపారు. పంట నష్టంపై డిసెంబర్ 15లోపు అంచనాలను రూపొందించి డిసెంబర్ 30 నాటికి బాధిత రైతులకు పరిహారం చెల్లిస్తామన్నారు.
పేదల ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక
డిసెంబర్ 25న పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామని.. దీనికి కేబినెట్ ఆమోదముద్ర వేసిందని కన్నబాబు తెలిపారు. తొలిదశలో 16లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. కోర్టు కేసుల్లో ఉన్న ఇళ్ల స్థలాలను తర్వాతి దశలో ప్రారంభించేందుకు కేబినెట్ నిర్ణయించిందన్నారు. ఆయా ఇళ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వాలనే కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో 2022 జూన్ నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. ఆయా కాలనీలకు మంచినీరు, విద్యుత్ సౌకర్యం తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారని చెప్పారు. డిసెంబర్ 15న వైఎస్ఆర్ పంటల బీమా చెల్లింపులు చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ఆరోజు నేరుగా రైతుల ఖాతాల్లోనే పంటల బీమా సొమ్ము జమ చేస్తామన్నారు. అంగన్వాడీ, హోంగార్డుల వేతన బకాయిలు చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు.
ఏపీ గేమింగ్ యాక్ట్-1974కు సవరణ
డిసెంబర్ 2న ఏపీ అమూల్ ప్రాజెక్టు, డిసెంబర్ 10న మేకలు, గొర్రెల పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసిందన్నారు. రైతుల భూములు వివాద రహితంగా ఉండేందుకు సాంకేతిక సహకారంతో భూముల రీసర్వే చేపడతామని.. ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 21న సీఎం ప్రారంభిస్తారని కన్నబాబు వివరించారు. ఆక్వారంగం అభివృద్ధికి ఫిషరీస్ చట్టం తీసుకొచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఆన్లైన్ గాంబ్లింగ్పై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. ఏపీ గేమింగ్ యాక్ట్-1974 చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్ట్లుల కోసం అభివృద్ధి కార్పొరేషన్, పల్నాడు ప్రాంతంలో కరవు నివారణకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని కన్నబాబు వివరించారు. వాస్తవ డిజైన్ల ఆధారంగానే పోలవరం నిర్మాణం జరుగుతుందని.. ఒక్క అంగుళం కూడా ఎత్తు తగ్గించబోమనే విషయాన్ని ఆ శాఖ మంత్రి స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు.