Breaking News

శబరిమలలో 39మందికి కరోనా

తిరువనంతపురం: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో 39మంది ఆలయ సిబ్బంది, యాత్రికులకు కరోనా సోకింది. ట్రావెన్‌కోర్‌ దేవస్థాన బోర్డు (టీడీబీ) తెలిపిన వివరాల ప్రకారం.. వార్షిక పూజల కోసం నవంబరు 16 నుంచి శబరిమలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో 27మంది ఆలయ సిబ్బంది సహా 39 మందికి కరోనా నిర్ధరణ అయినట్లు వారు తెలిపారు. కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. అందులో భాగంగా పరీక్షలు చేయించామని వారు వెల్లడించారు. సన్నిధానం, పంబ, నీలక్కల్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పాయింట్లలో మొత్తం 39 కేసులు నమోదైనట్లు వారు తెలిపారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో యాత్రికులు వచ్చే ప్రాంతాలైన తిరువనంతపురం, తిరువళ్ల, చెంగనూర్‌, కొట్టాయం రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో యాంటిజెన్‌ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా నిబంధనల ప్రకారం పది నుంచి అరవై ఏళ్ల వయసున్న వారినే ఆలయంలోనికి అనుమతిస్తున్నామని తెలిపారు. స్పెషలిస్టులతో కూడిన వైద్య బృందాలను ఆలయంలో విధులు నిర్వర్తించేందుకు ఏర్పాటు చేశామని టీడీబీ అధికారులు తెలిపారు.

ఏటా డిసెంబరు 26న మండలపూజ నిర్వహిస్తారు. జనవరి 14న మకరవిళక్కు నిర్వహించిన తర్వాత జనవరి 20న ఆలయాన్ని మూసేస్తారు. ఏటా ఈ కార్యక్రమాలకు భక్తులు లక్షల్లో హాజరై అయ్యప్ప దర్శనానికి పోటెత్తేవారు. కరోనా నేపథ్యంలో రోజుకు 1000 మంది, వారాంతాల్లో 2000 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. కరోనా మొదలైన తర్వాత వార్షిక పూజల కోసం మొదటిసారి ఆలయాన్ని తెరిచారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *