తెలుగు తేజం, అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన 6వ నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ భేటీలో కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, నరేంద్రసింగ్ తోమర్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీతి ఆయోగ్ సభ్యులు హాజరయ్యారు.
సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తేనే పారిశ్రామికాభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తామని స్పష్టం చేశారు. విభజన కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్న సీఎం..విభజనకు ముందు ప్రత్యేక హోదా ఇస్తామని బేషరతుగా పార్లమెంట్లో ప్రకటించినట్టు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీఎఫ్సీ, ఆర్ఈసీ రుణాలపై ఏడాదికి 10 నుంచి 11 శాతం వడ్డీలను చెల్లించాల్సి వస్తోందన్నారు. తయారీ రంగంలో ముందుంటున్న దేశాల్లో వడ్డీ రేట్లు 2 నుంచి 3శాతానికి మించి ఉండటం లేదన్నారు. రుణాలపై అధిక వడ్డీలు, విద్యుత్ ఖర్చులు భారంగా ఉన్నాయన్నారు. మంచి పనితీరు చూపిస్తున్న పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోందన్నారు. కేంద్రం నిర్దేశించిన సంస్కరణల విషయంలో ముందుకెళ్తున్నామని సీఎం జగన్ వివరించారు.
వ్యవసాయ అనుబంధ రంగాల్లో 5 రకాల చర్యలను చేపట్టాల్సి ఉంటుందన్నారు. పంటల ఉత్పత్తి ఖర్చును తగ్గించడంతో పాటు నాణ్యమైన విత్తనాలు, సర్టిఫై చేసిన ఎరువులు, పురుగుమందులను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందన్నారు. పంటల స్టోరేజీ, గ్రేడింగ్, ప్రాసెసింగ్ లో కొత్త టెక్నాలజీని తీసుకు రావాల్సి ఉందన్నారు. రైతులు తమ పంటలను సరైన ధరలకు అమ్ముకునేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.