తెలుగు తేజం, అమరావతి: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి వెబ్ ఆప్షన్ ప్రక్రియ గడువు ఈ నెల 15తో ముగియగా, ఉపాధ్యాయ సంఘాలు, టీచర్ల వినతి మేరకు మరో మూడ్రోజులు అంటే నేటి వరకు పొడిగించినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. సీపీఎస్‌కు సంబంధించి ప్రభుత్వ కార్యాచరణ కొనసాగుతోందన్నారు. అక్యూరల్ ఫర్మ్ పేరుతో ఇటీవల కమిటీ ఏర్పాటు చేశామని, ఇన్సూ్యరెన్స్ ప్రీమియం, రిస్క్‌లకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులపై ఈ కమిటీ రిపోర్టు అందజేసిందని, అది ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు. కాగా, బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు 71,947 మంది టీచర్లు (95శాతం) వెబ్ ఆప్షన్‌ను వినియోగించుకున్నట్టు తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాకే బదిలీల జీవోలను ప్రభుత్వం జారీ చేసిందన్నారు. ఈ నెల 20న ‘జగనన్న అమ్మఒడి’ తుది జాబితా పోర్టల్ పెడతామన్నారు. టీచర్ల బదిలీల వ్యవహారాన్ని రాజకీయాలకు వాడుకోవొద్దని టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి సూచించారు.