తెలుగు తేజం, అమరావతి : రవాణా వాహనానికి పర్మిట్ లేకపోయినా, పన్నులు చెల్లించకుండా వాహనం నడిపినా 200 శాతం జరిమానా విధించనున్నారు. అంతర్రాష్ట్ర పర్మిట్లపైనా రవాణాశాఖ దృష్టి సారించనుంది. వచ్చే ఏడాది నుంచి రవాణా వాహనాలకు సంబంధించి పూర్తిస్థాయి తనిఖీలు చేపడతామని సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీ కమిటీకి ఇటీవలే రవాణాశాఖ నివేదించింది. రవాణా వాహనానికి సంబంధించి ఏ పత్రం లేకపోయినా కేసులు నమోదు చేసేందుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖకు ఆదేశాలిచ్చింది. కోవిడ్ కారణంగా రవాణా వాహనాల పర్మిట్లు, రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల గడువు ఫిబ్రవరితో తీరిపోయినా.. ఈ ఏడాది డిసెంబర్ వరకు చెల్లుబాటయ్యేలా లాక్డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం ఆదేశాల ప్రకారం రవాణాశాఖ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి ఆ మేరకు కేసుల నమోదులో వెసులుబాటు కల్పించింది. ఈ గడువు ఈనెలాఖరుతో ముగుస్తున్నందున వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కఠినంగా రోడ్ సేఫ్టీ నిబంధనలు అమలు చేసేందుకు రవాణాశాఖ కింది స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చింది. దీంతో చెక్‌పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.