న్యూఢిల్లీ: ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ కేసుపై నవంబర్ 30న విచారణ చేపడుతామని ఉన్నతన్యాయస్థానం ప్రకటించింది. అలాగే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో దీపావళి పండుగ తర్వాత తీర్పును వెల్లడిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై ఈరోజు (గురువారం) సుప్రీం ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. కోర్ట్ నంబర్ 6లో ఐటమ్ నంబర్ 11గా చంద్రబాబు కేసు విచారణకు వచ్చింది. జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందు విచారణ జరిగింది. నవంబర్ 30న ఈ కేసును విచారిస్తామని సుప్రీం తెలిపింది. అప్పటి వరకు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని తెలిపింది. అలాగే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఇదే ధర్మాసనం తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే. పాత అర్డర్ ప్రకారం దీపావళి సెలవుల తర్వాత తీర్పును వెలువరిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.