మూలాలతో సహా పెకిలిస్తాం
బాధితులు ఎవరైనా ఉంటే డయల్ 100,112కు ఫిర్యాదు చేయండి : డీజీపీ సవాంగ్
తెలుగు తేజం, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో మైక్రో ఫైనాన్స్ ఆగడాలపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ సవాంగ్ చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మొబైల్ లోన్ యాప్‌లు మహిళల్నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో వీటి బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఆన్లైన్ యాప్‌లతో రుణం ఇస్తానన్న వారి మాటలు నమ్మొద్దని.. యాప్‌ల ద్వారా అప్పులు చేసి చిక్కుల్లో పడొద్దని హితవు పలికారు. లోన్ల పేరుతో బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందికి గత కొన్ని రోజులుగా ఫోన్లు చేసి ఆన్లైన్లో అప్పులిస్తామంటూ గుర్తు తెలియని వ్య క్తులు ఊరిస్తున్నారు. యాప్ డౌన్లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేస్తే చాలునని చెబుతున్నారు. అలా చేయగానే బాధితుల ఫోన్లో ఉన్న మొత్తం వివరాలు స్కాన్ చేసేస్తారు. రూ.3 వేలు అప్పిచ్చి రోజుకు 300కాల్స్ చేసి వేధిస్తారు. చివరికి ప్రాణాలు తీసుకునే స్థితికి తీసుకొస్తారు. దీనిపై ఇప్పటికే కొన్ని చోట్ల బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు డీజీపీకి దీనిపై సమాచారం అందించారు. మంగళవారం మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్స్‌లో తనను అప్పుల యాప్‌ల ఆగడాలపై సంప్రదించిన విలేకరులతో డీజీపీ సవాంగ్ మాట్లాడారు. ‘‘నొయిడా, ఢిల్లీ, గుర్గావ్ కేంద్రంగా అప్పుల యాప్‌లతో దేశమంతా వలలు పరిచారు. యాప్‌ల ద్వారా అందించే మైక్రో ఫైనాన్స్ వడ్డీల మూలాలను పసిగట్టి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎవరైనా వేధింపులను ఎదుర్కొంటుంటే సమీపంలోని పోలీ్‌సస్టేషన్ లేదా ఏపీ పోలీస్ సేవ, డయల్ 100, 112లకు ఫిర్యాదు చేయాలని కోరారు.