సూయిజ్‌లో నిలిచిపోయిన మరో 200 నౌకలు
కైరో: ఈజిప్టులోని సూయిజ్ కాలువలో చిక్కుకున్న భారీ నౌకను కదిలించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి నాటికి దాన్ని తిరిగి నీళ్లలో తేలేట్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నౌక యాజమాన్య కంపెనీ తెలిపింది. కాల్వ పోటుపెడుతున్న సమయంలో దీన్ని కదిలించేందుకు సాధ్యపడే అవకాశమున్నట్లు చెప్పింది.
అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి లాంటి సూయిజ్ కాలువలో గత మంగళవారం అతిపెద్ద కంటైనర్ నౌకల్లో ఒకటైన ఎవర్ గివెన్ చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ నౌక జపాన్‌కు చెందిన షూయీ కిసెన్ కేకే సంస్థకు చెందినది. శుక్రవారం రాత్రి ఈ సంస్థ ప్రెసిడెంట్ యుకిటో హిగాకీ మీడియాతో మాట్లాడారు. నౌకను కదిలించేందుకు కాలువ ఒడ్డున 10 టగ్బోట్లను ఉంచినట్లు తెలిపారు. కాలువ ఒడ్డును తవ్వి ఇసుకను తొలగించి నౌకను తిరిగి నీళ్లలో తేలేట్లు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. శనివారం సాయంత్రం అలలు పోటెత్తిన తర్వాత ఈ ప్రక్రియ మరింత వేగవంతం చేయనున్నట్లు చెప్పారు.
”నౌక బరువును తగ్గించేందుకు దానిలో ఉన్న దాదాపు 20వేల కంటైనర్లను దించాలి. అయితే అది చాలా క్లిష్టమైన ప్రక్రియ. అయినప్పటికీ మేం దాన్ని పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్ విఫలమైతే కంటైనర్లను దించే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం” అని యుకిటో వెల్లడించారు. నౌక కారణంగా సముద్ర మార్గంలో రవాణాకు తీవ్ర అంతరాయం కలిగిందని, ఇందుకు క్షమాపణలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు నౌకను కదిలించేందుకు శుక్రవారం చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు ఎగవర్ గివెన్ టెక్నికల్ మేనేజర్ తెలిపారు.
బలమైన గాలుల వల్లేనా..
ఎవర్ గివెన్ నౌక ఒకవైపు భాగం కాల్వ ఒడ్డును ఢీకొనడంతో అందులో కూరుకుపోయింది. బలమైన గాలుల వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇంజిన్ లేదా మెకానికల్ వైఫల్యం వల్ల నౌక కూరుకుపోయి ఉంటుందన్న వార్తలను కంపెనీ కొట్టిపారేసింది.
పెరుగుతున్న నౌకలు..
సూయిజ్ కాలువలో ఎవర్ గివెన్ నౌక అడ్డంగా ఇరుక్కుపోవడంతో ఈ మార్గంలో నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం నౌకకు ఉత్తరం, దక్షిణ భాగంలో 200లకు పైగా నౌకలు నిలిచాయి. మరో 100 నౌకలు ఇదే మార్గం దిశగా వస్తున్నాయి. ఇక్కడ నౌకలు కాన్వాయ్ పద్దతిలో వెళతాయి. ఈ క్రమంలో వేగం, నౌకల మధ్య దూరంపై ఆంక్షలు ఉన్నాయి. అయితే కొన్ని నౌకలు మాత్రం పత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి.
సముద్ర దొంగల భయం..
తాజా ఘటనతో సూయిజ్ కాలువలో నౌకల రవాణా నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయంగా ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఆఫ్రికా తీరంలో ప్రత్యేకించి సోమాలియాలో సముద్రదొంగలు ఎక్కువగా ఉంటారు. వీరు ఈ మార్గంలో వచ్చే నౌకలపై దాడులు చేసే అవకాశాలున్నాయని నౌకసంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో నౌకల రక్షణకు ఆయా తీరదేశాలు కార్యాచరణ ప్రారంభించాయి.