బీసీ సమన్వయ కమిటీ నియోజకవర్గ అధ్యక్షుడు నిడుముక్కల శివశంకరరావు
తెలుగు తేజం , ఇబ్రహీంపట్నం:ఎంతో మంది త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం అన్యాయమని బీసీ సమన్వయ కమిటీ నియోజకవర్గ అధ్యక్షుడు నిడుముక్కల శివశంకరరావు అన్నారు. ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో ఆంధ్రుల గుండె రగిలిపోతుందన్నారు. ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూ.వేల కోట్ల లాభాలు సంపాదించి పెట్టిన ఫ్యాక్టరీని పథకం ప్రకారం విక్రయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను విక్రయించే హక్కు ప్రధాని మోదీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను రక్షిస్తారని మోదీని గద్దెనెక్కిస్తే ఒక్కొక్కటి అమ్మేయాలని చూడటం సబబుగా లేదన్నారు. ప్రజలను మోసగించిన ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయని, మీకూ అదే గతి పడుతుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారన్నారు. విశాఖ ఉక్కులో ప్రభుత్వ ఉద్యోగులను ప్రైవేట్ ఉద్యోగులుగా మార్చే అధికారం ప్రధాని మోదీకి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. 80 వేల మంది ఉద్యోగుల ఉసురు కొట్టుకోవద్దన్నారు. ఎల్ఐసీ, బీసీఎన్ఎల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అమ్మేయాలని చూడటం బాధాకరమన్నారు. ప్రధాని మోదీకి పరిపాలన చేతకాకపోతే దిగిపోవాలన్నారు. పార్లమెంట్ లో బలం ఉందని విర్రవీగితే ప్రజలు సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సమావేశంలో బీసీ నాయకులు మల్లికార్జునరావు, వెంకట్రామయ్య, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.