న్యూఢిల్లీ : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆదివారం ఉదయం 6.30 గంటలకు సతీమణి అక్షతామూర్తితో కలిసి ఆలయానికి చేరుకున్న రిషి.. 45 నిమిషాల పాటు అక్కడే గడిపారు. గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామినారాయణ్ బంగారు విగ్రహానికి రిషి దంపతులు పుష్పార్చన చేశారని, అనంతరం హారతి కార్యక్రమంలోనూ పాల్గొన్నట్లు అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన దాదాపు 100 ఎకరాల్లో నిర్మించిన ఆలయ చరిత్ర, నిర్మాణ కౌశలం గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ అధికారులు బ్రిటన్ ప్రధాని దంపతులకు చలువరాయితో చేసిన ఏనుగు విగ్రహం, నెమలి బొమ్మ, అక్షరధామ్ నమూనాను బహూకరించారు. ‘‘భారతీయ మూలాలు, భారత్‌తో నాకున్న సంబంధాల పట్ల ఎంతో గర్వపడుతున్నా. హిందువుగా గర్వపడుతున్నా. దీనర్థం నాకు ఎల్లప్పుడూ భారత్‌తో, భారత ప్రజలతో సంబంధాలు ఉంటాయి’’ అని అక్షరధామ్ ఆలయ సందర్శన అనంతరం రిషి సునాక్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు, రిషి సునాక్ తల్లి ఉషా సునాక్ బెంగళూరులో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. ఉషా సునాక్, తమ వియ్యంకురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధా నారాయణమూర్తి కుటుంబీకులను కలిసేందుకు బెంగళూరుకు వచ్చారు. ఈ సందర్భంగా చిక్కపేట బీజేపీ ఎమ్మెల్యే ఉదయ్ గరుడాచార్ నివాసంలో శనివారం జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.