వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. వరుసగా ఐదో రోజు లక్షకుపై కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో అమెరికాలో దాదాపు 1.03లక్షల మంది మహమ్మారి బారినపడగా.. 512 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు అమెరికాలో నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య కోటి దాటగా.. మహమ్మారికి బలైన వారి సంఖ్య 2.43లక్షలకు చేరింది. అధికారిక లెక్కల ప్రకారం.. కేవలం పది రోజుల్లోనే అమెరికాలో పది లక్షల కేసులు నమోదయ్యాయి. అమెరికా అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో టెక్సాస్, కాలిఫోర్నియా, ఫ్లోరిడాలు వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. టెక్సాస్‌లో మహమ్మారి బారినపడిన వారి సంఖ్య పదిలక్షలు దాటింది. కాగా.. కరోనా కేసులు విపరీతంగా పెరగడానికి ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలు కూడా ఓ కారణమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారినపడిన వారి సంఖ్య ఐదు కోట్లు దాటింది.