2014వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాస్తా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయాయి. అశాస్త్రీయ విభజన కారణంగా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రపుటల కెక్కిన దుస్థితి. ఎన్నో పరిణామాల అనంతరం అమరావతిని రాజధానిగా ఎంచుకున్న తర్వాత కూడా రాజకీయ అడ్డంకులు ఆగలేదు. రాజధానిగా ఎన్నుకున్న అమరావతి ప్రాంతంలో కమ్మవారు ఎక్కువగా ఉన్నారనీ, వారి ఆధిపత్యమే ఇక్కడ కూడా ఉండబోతోందని మేధావి వర్గంగా చెప్పుకున్న వారు ఓ ప్రత్యేక చర్చకు తెరతీశారు. అదే సమయంలో అమరావతిని ఎంచుకున్నారు కానీ.. నాటి చంద్రబాబు సర్కారు రాజధాని నిర్మాణ పనులను చేయడంలో జాప్యం చేశారన్న కొత్త వాదన కూడా రాజకీయ కుట్రలో భాగంగా తెరపైకి వచ్చింది. రాజధానిగా అమరావతికి నాడు అసెంబ్లీలో మద్ధతు ప్రకటించిన ప్రధాన ప్రతిపక్షం.. నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్టణం రాగాన్ని ఆలపించడం వెనుక కారణాలు ఏంటి..? అసలు నిజాలు ఏంటి..? అన్న ప్రశ్నలకు సరైన సమాధానాలను ఇచ్చే ప్రయత్నం చేశారు సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేష్. ఆయన రాసిన అమరావతి వివాదాలు-వాస్తవాలు పుస్తకంలో ‘రాజధాని అమరావతి’పై జరిగిన కుట్రలు, అమరావతిపై జరిగిన పుకార్లు, అబద్ధపు ప్రచారాలకు సంబంధించిన అసలు నిజాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ పుస్తకావిష్కరణ సెప్టెంబర్ 8వ తారీఖున విజయవాడలో జరగబోతోంది.