Breaking News

అమిత్‌ షా జోక్యం…చట్టాల రద్దు అసాధ్యం



సవరణలపై లిఖితపూర్వక ప్రతిపాదనకు ఓకే
ఆ ప్రతిపాదనపై నేడు రైతు నేతల చర్చ
నేటి ఆరో దఫా చర్చలు రద్దు
నేడు రాష్ట్రపతితో విపక్ష నేతల భేటీ

న్యూఢిల్లీ : మళ్లీ అదే తీరు… ప్రభుత్వం మెట్టు దిగలేదు. రైతులు పట్టు వీడలేదు. 13 రోజులుగా సాగుతున్న రైతాంగ ఆందోళనను విరమింపజేసేందుకు రంగంలోకి దిగిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇరు పక్షాలూ పూర్వ వాదనలకే కట్టుబడ్డాయి. ఈ ప్రయత్నం సఫలం కాకపోవడంతో బుధవారంనాడు జరగాల్సిన ఆరో రౌండ్‌ చర్చలు రద్దయ్యాయి. చట్టాల రద్దుకు ససేమిరా అన్న ప్రభుత్వం తామెలాంటి సవరణలు తేదల్చుకున్నదీ వివరిస్తూ ఓ ప్రతిపాదనను రైతులకు పంపనుంది. దానిని రైతు సంఘాల నేతల బుధవారం 12 గంటలకు సింఘూ సరిహద్దు కేంద్రం వద్ద సమావేశమై చర్చించి తమ నిర్ణయాన్ని తెలియజేస్తారని షా తో సమావేశానంతరం బయటికొచ్చిన రైతు సంఘాల ప్రతినిధులు చెప్పారు. మంగళవారంజరిగిన భారత్‌ బంద్‌ కొన్ని రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపడం, దేశ విదేశాల్లో ప్రభుత్వ ఇమేజి దెబ్బతింటూండడంతో అమిత్‌ షా రంగంలోకి దిగారు. ఓ పక్క బంద్‌ కొనసాగుతున్న సమయంలోనే ఆయన వారికి కబురు పంపారు. దాంతో సింఘూ సరిహద్దుల నుంచి 13 మంది రైతు సంఘం నేతలు ఆయనను కలిశారు.

షా నివాసంలో చర్చలకు కొందరు రైతునేతలు విముఖత చూపడంతో పూసా ఏరియాలో ఉన్న వ్యవసాయ పరిశోధన సంస్థ వద్ద సమావేశం షెడ్యూల్డ్‌ సమయం కంటే రెండు గంటల ఆలస్యంగా రాత్రి తొమ్మిది గంటలకు మొదలైంది. ఇందులో పాల్గొన్న 13 మందిలో ఎనిమిది మంది పంజాబీ రైతు సంఘాల వారు కాగా మిగిలిన ఐదుగురూ దేశంలోని వివిధ యూనియన్లకు చెందినవారు. ఆలిండియా కిసాన్‌ సభకు చెందిన హన్నన్‌ మొల్లా, భారతీయ కిసాన్‌ యూనియన్‌కు చెందిన రాకేశ్‌ తికాయత్‌ వారిలో ఉన్నారు. అమిత్‌ షాతో చర్చించేందుకు ఏమీ లేదని, చట్టాలను రద్దు చేస్తారా లేదా… అవును లేదా కాదు… అన్నది మాత్రమే అడుగుతున్నామని రైతు నేత రుద్రు సింగ్‌ మాన్సా సమావేశానికి ముందే చెప్పారు. సమావేశం కూడా ఆ తరహాలోనే సాగింది. రైతు నేతలిచ్చిన సమాచారం ప్రకారం… చేసిన చట్టాల్ని రద్దు చేయడం అసాధ్యమని అమిత్‌ షా స్పష్టం చేశారు. రద్దు మినహా ఏ తరహా సవరణలకైనా సిద్ధంగా ఉన్నామని తెలియపర్చారు. సవరణలకు తాము వ్యతిరేకమని, ఇందులో మార్పు లేదని రైతు నేతలు తేల్చిచెప్పారు. ఆ సమయంలో షా వారి ముందు ప్రతిపాదన ఉంచారు. ‘చట్టాలపై మీకున్న 39 అభ్యంతరాలనూ పరిశీలించాం ప్రభుత్వం ఏమేం సవరణలు చేయదలిచిందీ మీకు పంపిస్తాం… పరిశీలించండి’ అని కోరారు. రైతు సంఘాల నేతలు అందుకు అంగీకరించారు. ఈమేరకు బుధవారం నరేంద్ర తోమర్‌, పీయూష్‌ గోయల్‌ సారథ్యంలోని ప్రభుత్వ బృందంతో తాము జరిపే చర్చలను రద్దు చేసినట్లు కిసాన్‌ సభ నేత హన్నన్‌ మోలా రాత్రి 11-30 గంటలకు మీడియాకు చెప్పారు. ప్రభుత్వంపై తమకు విశ్వాసం కలగడం లేదని చెప్పిన కొందరు రైతు ప్రతినిధులు ఆందోళనను ఉధృతం చేయడమే మార్గాంతరమంటున్నారు. బుధవారం రైతులు తమలో తాము జరిపే చర్చల్లో ఏ విషయమూ ఖరారు కావొచ్చని తెలుస్తోంది.

నేడు రాష్ట్రపతితో విపక్ష నేతల భేటీ
రైతుల నిరసనతో మమేకమయ్యేందుకు ప్రతిపక్షాల్లో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్‌ పవార్‌, సిపిఎం నేత సీతారాం ఏచూరి చర్చలు జరిపారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు అయిదుగురు సభ్యుల ప్రతినిధి వర్గం రాష్ట్రపతి కోవింద్‌ను కలుసుకోనుంది. రాహుల్‌, పవార్‌, ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, డిఎంకె నేత టిఆర్‌ బాలు ఈ ప్రతినిధి వర్గంలో ఉన్నారు. రైతాంగ సంక్షోభాన్ని సృష్టిస్తున్న సాగు చట్టాలను రద్దు చేసేలా రాష్ట్రపతి జోక్యం కోరనున్నట్లు ఏచూరి వెల్లడించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *