అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు రాజమహేంద్రవరంలో బయలుదేరిన చంద్రబాబు బుధవారం ఉదయం 5 గంటలు దాటాక ఉండవల్లి చేరుకున్నారు. నివాసానికి చేరుకోగానే చంద్రబాబుకు సతీమణి నారా భువనేశ్వరి హారతిచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆమె దిష్టి తీశారు. మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకుని గుమ్మడికాయలు కొట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి నిన్న సాయంత్రం రోడ్డుమార్గాన బయలుదేరారు. అడుగడుగునా తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రాజధాని రైతులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు దారి పొడవునా హారతులు పట్టి తమ అభిమాన నేతను చూసి భావోద్వేగానికి గురయ్యారు. సుమారు 13 గంటలపాటు చంద్రబాబు ప్రయాణం చేశారు. కరకట్ట నుంచి చంద్రబాబు నివాసం వరకు రైతులు పూలబాట పరిచారు.
చంద్రబాబురాకతో దద్దరిల్లిన బెజవాడ
తెల్లవారు జాము 4 గంటల ప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్ రామవరప్పాడు మీదుగా విజయవాడ నగరంలోకి ప్రవేశించింది. ఆయన రాక కోసం ఎదురుచూస్తున్న తెలుగు దేశం అభిమానులు ఆయనను చూడగానే ఒక్కసారిగా కేరింతలు కొడుతూ రోడ్లపైకి వచ్చారు. బాబు చూసేందుకు రోడ్ల మీద పడుకుని మరి పడిగాపులుకాసారు. వందలాది వాహనాలు చంద్రబాబుని అనుసరిస్తూ వచ్చాయి. జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంటూ నినాదాలతో విజయవాడ నిర్మలా కాన్వెంట్, బెంజి సర్కిల్ పరిసరాలు మారుమోగాయి. కనకదుర్గ వారధి, తాడేపల్లి, ఉండవల్లి సెంటర్లలో చంద్రబాబు రాక కోసం జనం గంటల తరబడి ఎదురు చూపులు చూశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెల్లవారుజామున సైతం విజయవాడ నగర ప్రజలు చంద్రబాబును చూసేందుకు గంటలతరబడి నిరీక్షించారు.