ఈనెల 18న విశాఖ ఆర్కే బీచ్ లో కార్మిక సమర శంఖారావం
తెలుగు తేజం, విశాఖ : విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం మరింత తీవ్రంగా మారుతోంది. ఈ నెల 18న తల పెట్టిన రైతు, కార్మిక సమర శంఖారావ సభను జయప్రదం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ర్యాలీకి రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ సహా పలువురు జాతీయ నేతలు రానున్నారు. మరోవైపు స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునే దిశగా కార్మిక నేతలను ఢిల్లీ తీసుకెళతామని ప్రకటించారు ఎంపీ విజయసాయి.
విశాఖ ఉక్కు ఉద్యమాన్ని మరింత ఉదృతంగా ముందుకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.. ఇందులో భాగంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఈనెల 18న విశాఖ ఆర్కే బీచ్ లో రైతు, కార్మిక సమర శంఖారావం సభను నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. ఈ సభను విజయవంతం చేసే దిశగా ఇవాళ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మద్దెలపాలెం జంక్షన్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ కొనసాగింది. వందలాది మంది విద్యార్థులు, యువత పాల్గొన్నారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ వీరంతా నినాదాలు చేశారు.. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ పోరాటంలో వైసీపీ, టీడీపీ కూడా కలిసిరావాలని విద్యార్థినేతలు డిమాండ్ చేశారు విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం ఈ నెల 18న ఆర్కే బీచ్‌లో తలపెట్టిన రైతు, కార్మిక సమర శంఖారావ సభలో ఢిల్లీ రైతు ఉద్యమ నాయకుడు రాకేష్ సింగ్ టికాయత్‌తో పాటు పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకుడు పాల్గొంటారని విశాఖ ఉక్కు పరిశ్రమ పోరాట కమిటీ నేతలు తెలిపారు.
కేంద్రం ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సభను జయప్రదం చేయాలని వారు కోరారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని విశాఖ ఉక్కు పరిశ్రమ పోరాట కమిటీ నాయకులు పిలుపునిచ్చారు..
మరోవైపు విశాఖ ఉక్కు ప్రైవైటీకరణకు తమ పార్టీ పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునే దిశగా త్వరలోనే కార్మిక సంఘాలన్నింటినీ ఢిల్లీ తీసుకెళ్తమని తెలిపారాయన.. ఏపీలో బీజేపీకి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పెద్ద దెబ్బగా మారనుందని వ్యాఖ్యానించారు విజయసాయి. ఏపీలో తిరుపతి ఉప ఎన్నికల ముగింపు దగ్గర పడిన నేపథ్యంలో ఇక అన్ని పార్టీలు, కార్మిక సంఘాల దృష్టి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం మీదే నిలచే అవకాశం ఉంది.