తెలుగు తేజం, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. విజయవాడలో ఎస్ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వైకాపా, కాంగ్రెస్, సీపీఎం పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. తెదేపా, భాజపా, జనసేన పార్టీలు ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి.
ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాన్ని నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని తెదేపా, జనసేన, భాజపా ప్రకటించాయి. . గురువారం సాయంత్రం సమావేశ ఆహ్వానం పంపిన ఎస్ఈసీ.. రాత్రి ఎన్నికల తేదీలను ప్రకటించడం, పాత నోటిఫికేషన్ ప్రకారమే నిర్వహిస్తామని నిర్ణయించడం అప్రజాస్వామిక చర్యగా పేర్కొన్నాయి. జనసేన హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రాకముందే ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని జనసేన అధ్యక్షుడు పవన్ తెలిపారు. ఈ నిర్ణయం అధికారపార్టీకి లబ్ధి చేకూర్చేందుకేనని జనసేన భావిస్తున్నట్లు ఆయన వివరించారు.