బాధితులు 505, 332 మంది డిశ్చార్జ్
తెలుగు తేజం, ఏలూరు: ఏలూరులో అంతుచిక్కని వ్యాధి బారిన పడిన వారి సంఖ్య సోమవారం రాత్రి 10 గంటల సమయానికి 475కు చేరింది. వారిలో 332 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా.. 125 మంది ఏలూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 18 మందిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. మొత్తం బాధితుల్లో 253 మంది పురుషులు కాగా.. 222 మంది మహిళలు ఉన్నారు. పెస్టిసైడ్, ఇ–కోలి పరీక్షల రిజల్ట్స్ రావాల్సి ఉంది. అధికార యంత్రాంగం మొత్తం ఏలూరులోనే మోహరించి వ్యాధి ఏమిటనేది తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్‌తోపాటు వైద్య శాఖ ఉన్నతాధికారులు, వైద్య నిపుణులు ఏలూరులోనే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్, కలెక్టర్ ఆర్.ముత్యాలరాజుతో కలిసి తాజా పరిస్థితిపై ప్రభుత్వాస్పత్రిలో సోమవారం రాత్రి సమీక్షించారు. ప్రభుత్వాస్పత్రిలో 9 వార్డుల్లో 250 బెడ్లు సిద్ధంగా ఉన్నాయని, మరో 50 బెడ్లు సైతం అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.