న్యూఢిల్లీ: ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్, కంటెంట్ అందించే సంస్థలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. వీటిని సమాచార, ప్రసార శాఖ పరిధిలోకి తీసువస్తూ తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం సంతకం చేశారు. దీంతో నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ తదితర పలు సంస్థలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి చేరినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటివరకూ డిజిటల్ కంటెంట్‌ను నియంత్రించేందుకు ఎలాంటి చట్టాలు లేదా స్వతంత్ర ప్రతిపత్తిగల అధికారిక సంస్థ ఏర్పాటుకాని నేపథ్యంలో తాజా ఆదేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.
ప్రెస్ కౌన్సిల్
ప్రస్తుతం ప్రింట్ మీడియాను ప్రెస్ కౌన్సిల్ నియంత్రిస్తోంది. ఇదేవిధంగా వార్తా ప్రసార చానళ్లను న్యూస్ బ్రాడ్ క్యాస్టర్స్ అసోసియేషన్(ఎన్‌బీఏ) మానిటర్ చేస్తోంది. సినిమాల విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)కి అధికారాలుండగా.. ప్రకటనలకు సంబంధించి అడ్వర్టయిజింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియంత్రణ బాధ్యతలు చూస్తోంది.
పిటిషన్..
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నియంత్రణపై దాఖలైన పిటిషన్‌పై విచారణలో భాగంగా గత నెలలో సుప్రీం కోర్టు.. కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాలను కోరింది. స్వతంత్ర సంస్థ ద్వారా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను నియంత్రించే అంశంపై కేంద్రం, సమాచార ప్రసార శాఖ, దేశీ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్స్‌కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పరిధిలో న్యూస్ పోర్టల్స్‌తోపాటు.. హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో తదితర స్ట్రీమింగ్ సర్వీసుల సంస్థలు వస్తాయి. వీటిని ఇంటర్నెట్ లేదా ఆపరేటర్ల నెట్‌వర్క్ ద్వారా వీక్షించేందుకు వీలుంటుంది. కాగా.. ఓటీటీ లేదా వివిధ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఫిల్ములు, సిరీస్‌ల తయారీదారులు సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్లు పొందకుండానే కంటెంట్‌ను విడుదల చేస్తున్నట్లు పిటిషన్‌లో ఫిర్యాదుదారు పేర్కొన్నారు.