తెలుగు తేజం, అమరావతి: కరోనా నిరోధానికి వ్యాధి ప్రారంభమైన తొలినాళ్లలో ఉన్న సామాజిక స్పృహ, ఆరోగ్య చైతన్యం రానురాను కనిపించడం లేదు. ఇది పెను విపత్తుకు దారితీసే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాధితుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు వ్యక్తులు యథావిధిగా బయట తిరుగుతున్నారు. రోగ నిర్ధారణకు ముందు, ఆసుపత్రులకు వెళ్లే సమయంలో, ఇతర ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్లినప్పుడు బాధితులు చాలామంది తగిన రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. మరికొన్ని చోట్ల ఇంట్లో ఉన్న నలుగురు కుటుంబ సభ్యుల్లో ముగ్గురికి కరోనా సోకితే మరొకరు విధిలేని పరిస్థితుల్లో వారితో కలిసి ఉండాల్సి వస్తోంది. ఇది వ్యాధి విస్తృతికి కారణమవుతోంది. వైరస్ సోకిన వారిలో సుమారు 8,500 మంది ఇళ్లలోనే ఉంటున్నారు. కేసు నమోదయ్యాక రెండు వారాల వరకు రోగి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు వ్యక్తులు ఇళ్లలోనే ఉండాలి. వారు నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలి. ఇవేమీ ఆచరణలో కనిపించడం లేదు. ప్రస్తుత రోగ విస్తృతినిబట్టి 86వేల మంది కాంటాక్టు వ్యక్తులు క్వారంటైన్ కావాల్సి ఉంది. వీరిలో 7,925 మంది ఈ నిబంధనను విస్మరిస్తున్నారని వైద్య, ఆరోగ్యశాఖ పరిశీలనలో తేలింది. ఉభయ గోదావరి జిల్లాల్లో వీరి సంఖ్య ఎక్కువ. కార్వంటైన్‌లో ఉండాల్సినవారి తప్పుడు చిరునామాలు ఇస్తున్నారని ఏఎన్‌ఎంల క్షేత్ర స్థాయి అధ్యయనంలో తేలింది. క్వారంటైన్‌ను ఉల్లంఘించిన 400 మందిని ఆరోగ్య సిబ్బంది ఇటీవల గుర్తించారు.
మూడో కంటికి తెలియకుండా..
ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు వచ్చాక కేసుల వివరాలు పూర్తి స్థాయిలో నమోదు కావడంలేదు. అనధికార పరీక్షల ద్వారా పాజిటివ్ వచ్చినట్లు తేలిన వెంటనే మూడో కంటికి తెలియకుండా ఇంట్లో ఉంటున్నారు. ప్రైవేటు వైద్యులను ఫోన్లలో సంప్రదిస్తున్నారు. వీరితోపాటు ఉండే ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు వ్యక్తులు కనీస జాగ్రత్తలు తీసుకోవడంలేదు. అనుమానిత లక్షణాలు లేవన్న ఉద్దేశంతో పరీక్షలనూ చేయించుకోవడం లేదు. వైరస్ సంక్రమణకు కనీసం మూడ్రోజులనుంచి వారం సమయం పట్టే అవకాశముంది. ఇదే సమయంలో బాధితుడి వివరాల సేకరణకే ఆరోగ్య సిబ్బంది ప్రాధాన్యమిస్తున్నారు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసి మిన్నకుంటున్నారు.
జిల్లాలవారీగా ఇదీ పరిస్థితి..
పశ్చిమగోదావరి జిల్లాలో 1,212, తూర్పుగోదావరి-1,936, కృష్ణా-1,687, గుంటూరు-75, విశాఖ జిల్లాలో 623 మంది చొప్పున ఐసొలేషన్‌లో ఉన్నారు. మిగిలినవారు ఇతర జిల్లాలవాసులు. వీరిలో ప్రస్తుతం 30 మంది ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున ఆసుపత్రుల్లో చేరుస్తున్నారు.