Breaking News

కామినేనిలో డే-కేర్‌ యూనిట్‌ ప్రారంభం : సీవోవో డాక్టర్‌ నవీన్‌కుమార్‌

ఆపరేషన్‌ చేసిన రోజునే డిశ్చార్జిఫ వెల్లడించిన వైద్యనిపుణులు

తెలుగు తేజం, విజయవాడ : ఉదరకోశ వ్యాధులకు సంబంధించిన అతి క్లిష్టమైన శస్త్రచికిత్సలను అత్యాధునిక పద్ధతుల్లో నిర్వహించేందుకు కామినేని అడ్వాన్స్‌డ్‌ గ్యాస్ట్రో సర్జరీ విభాగం ఆధ్వర్యంలో డే-కేర్‌ (షార్ట్‌ స్టే) యూనిట్‌ను ప్రారంభించినట్లు కామి నేని హాస్పిటల్‌ సీవోవో డాక్టర్‌ నవీన్‌కుమార్‌ వెనిగళ్ల తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా తలెత్తిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్‌ చేసిన రోజునే రోగిని డిశ్చార్జి చేస్తామని చెప్పారు. తమ హాస్పిటల్‌ వైద్యనిపుణులు సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌లు డాక్టర్‌ గొర్తి గణేష్‌, డాక్టర్‌ పవన్‌ వెలినేని, జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ దీప్తి ప్రవల్లికలతో కలిసి బుధవారం విజయవాడలోని ఒక హోటల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. కొవిడ్‌ కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితులను అధిగమించి ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందించాలనే సంకల్పంతోనే తమ హాస్పిటల్‌లో డే-కేర్‌ సర్జరీ యూనిట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. సర్జకిల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్‌ గొర్తి గణేష్‌ మాట్లాడుతూ జీర్ణకోశ కేన్సర్‌, లివర్‌, గాల్‌బ్లాడర్‌, పాంక్రియాస్‌, చిన్నపేగు, పెద్దపేగు, అపెండిసైటిస్‌, లాపరోస్కోపిక్‌, కడుపులో గడ్డలు, బేరియాట్రిక్‌ తదితర ఉదరకోశ వ్యాధులకు సంబంధించిన ఆపరేషన్లను డే-కేర్‌ యూనిట్‌ ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు. రోగి ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా సమీక్షించిన తర్వాత నిర్దిష్టమైన పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆపరేషన్‌ రోజునే రోగిని డిశ్చార్జి చేస్తామని వివరించారు. రోగులు ఎక్కువ రోజులు హాస్పిటల్‌లో ఉండటం వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి తప్పించు కోవడానికి ఈ డే-కేర్‌ సర్జరీల ద్వారా రక్షణ లభిస్తుందన్నారు. రోగిని వెంటనే డిశ్చార్జి చేయడం వల్ల కుటుంబ సభ్యులు ఆసుపత్రి చుట్టూ తిరిగే ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్పారు. రోగులు ఇంటి వద్ద అలవాటైన వాతావరణంలో ఉండటం వల్ల త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని వివరించారు. సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ పవన్‌ వెలినేని మాట్లా డుతూ డే-కేర్‌ సేవల ద్వారా రోగులకు మెరుగైన ఫలితాలు లభిస్తాయన్నారు. జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ దీప్తి ప్రవల్లిక మాట్లాడుతూ తమ కామినేని హాస్పిటల్‌లో రోగులకు నిరంతరం వైద్య సేవలందించేందుకు అనుభవజ్ఞులైన వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *