తెలుగు తేజం, విజయవాడ: ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద, పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో నదిపై ఉన్న ప్రాజెక్టులకు భారీగా ప్రవాహం పోటెత్తుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రవాహం చేరుతున్నప్పుడే ముందస్తుగా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని, లోతట్టు ప్రాంత, లంకగ్రామల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా వరద ఉధృతి అధికంగా ఉంది. శనివారం శ్రీశైలం ప్రాజెక్టుకు 5.98లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో పది గేట్లు 25 అడుగుల మేర ఎత్తి 5.67లక్షల క్యూసెక్కులు.. కుడిగట్టు పవర్‌హౌస్ నుంచి 26,465 క్యూసెక్కులు.. మొత్తం 5.93 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌లోకి వదులుతున్నారు. శ్రీశైలం నీటి మట్టం 884.30 అడుగులుగా ఉంది. ఇది 211.4759 టీఎంసీలకు సమానం. నాగార్జునసాగర్ జలాశయానికి శనివారం 5.51 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైన విషయం తెలిసిందే.