దిల్లీ: జీ20 సదస్సులో పాల్గొనేందుకు భారత్ వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau).. తన విమానంలో సాంకేతిక సమస్యతో ఇక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
ఎట్టకేలకు ఆ సాంకేతిక లోపాన్ని పరిష్కరించడంతో మంగళవారం మధ్యాహ్నం ఆయన తిరిగి కెనడాకు పయనమయ్యారు. అయితే.. ట్రూడో, ఆ దేశ ప్రతినిధుల తిరుగు ప్రయాణానికి వీలుగా సోమవారమే భారత్ తన అధికారిక ‘ఎయిర్ ఇండియా వన్ విమానాన్ని వినియోగించుకోవాలని సూచించినట్లు సంబంధిత వర్గాల సమాచారం. కానీ, కెనడా మాత్రం తమ మరో విమానం వచ్చే వరకు వేచి చూసేందుకే మొగ్గుచూపిందట. వాస్తవానికి ఆదివారం సాయంత్రమే జస్టిన్ ట్రూడో భారత్‌ను వీడాల్సింది. కానీ, విమానంలో సాంకేతిక సమస్యతో ఇక్కడే ఆగిపోయారు. దీంతో ట్రూడో కోసం మరో విమానాన్ని కెనడా ఎయిర్‌ఫోర్స్ పంపింది. ఇటలీ మీదుగా అది భారత్‌కు వస్తోన్న తరుణంలో.. ఈ సమస్య కొలిక్కి రావడం గమనార్హం. దీంతో రెండో విమానాన్ని లండన్ వైపు మళ్లించారు. ఇదిలా ఉండగా.. జీ20 సదస్సుకు వచ్చిన ట్రూడో పర్యటన సాంతం అసౌకర్యంగానే కనిపించారు. సదస్సు తొలిరోజు నిర్వహించిన విందుకు కూడా హాజరు కాలేదు. ప్రపంచ దేశాధినేతలు రాజ్‌ఘాట్‌లో నివాళులు అర్పించే సమయంలో కూడా ట్రూడో ఎవరితో పెద్దగా కలవకుండా ఉన్నారు.