దిల్లీ: వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ దేశ రాజధాని సరిహద్దుల్లో చేపట్టిన ఆందోళనలను మరింత ఉద్ధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. వెంటనే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, అందుకోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరాయి. రేపటిలోగా చట్టాల రద్దుకు నిర్ణయం తీసుకోకుంటే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించాయి. రేపు కేంద్రంతో మరోసారి రైతు సంఘాల ప్రతినిధులు భేటీ కానున్న నేపథ్యంలో ఈ డిమాండ్ చేయడం గమనార్హం. ఈ మేరకు రైతు సంఘాల నేతలు బుధవారం మీడియాతో మాట్లాడారు.
తమ డిమాండ్లను పరిష్కరించకుంటే దేశ రాజధానిలోని మిగిలిన రోడ్లనూ దిగ్బంధిస్తామని ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. రైతు సంఘాల మధ్య చిచ్చు పెట్టాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. రైతు సంఘాలన్నీ ఐక్యంగానే ఉన్నాయని ప్రకటించారు. కేంద్రం వ్యవసాయ చట్టాలు రద్దు చేయకపోతే ఉద్యమం మరింత పెరిగి ప్రభుత్వం పడిపోతుందని హెచ్చరించారు. డిసెంబర్ 5న దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి, కార్పొరేట్లకు వ్యతిరేకంగా దిష్టి బొమ్మలు దహనం చేస్తామన్నారు. చట్టాలను రద్దు చేసే వరకు ఈ ఆందోళన కొనసాగుతుందని స్పష్టంచేశారు. అంతకుముందు 32 రైతు సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు.