చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావును విమర్శించే అర్హత ఆయనకు లేదు
తెలుగు తేజం, విజయవాడ: కేడీసీసీ బ్యాంకులో అభివృద్ధి గురించి తెలుసుకోకుండా ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జాతీయ కార్యదర్శి బీఎస్ రాంబాబు ఆరోపణలు చేయటం మానుకోవాలని బ్యాంక్ సీఈవో ఎన్.రాజయ్య సూచించారు. చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావును విమర్శించే అర్హత ఆయనకు లేదన్నారు. బ్యాంకులో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్చకు సిద్ధమేనన్నారు. నగరంలోని కేడీసీసీ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్యాంకుపై ఆరోపణలు చేసే ముందు యూనియన్ నాయకులుగా చెప్పుకొంటున్న వారు ఏ రోజైనా తనతో మాట్లాడారా? అని ప్రశ్నించారు.
తాను అణగారిన వర్గానికి చెందిన అధికారిని కావడం వల్లే తనతో మాట్లాడటానికి ఫీలవుతున్నారన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఏళ్ల తరబడి పనిచేస్తున్న పలువురు అధికారులను బదిలీ చేశానని, వారు తనను యూనియన్ నాయకులతో బెదిరించారని, ఈ విషయాన్ని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి వారిపై కేసు పెడతానంటే వద్దని వారించారని చెప్పారు. నిబంధనల మేరకే అధికారులను బదిలీ చేశానన్నారు. ఈ సమావేశంలో బ్యాంక్ జీఎం ఎ.శ్యామ్ మనోహర్, ఏజీఎం కె.అమరేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.