తెలుగు తేజం, విశాఖ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి కొత్త టారిఫ్‌ను ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ప్రకటించింది. సగటు యూనిట్ ధరను రూ.7.17 నుంచి రూ.6.37కు తగ్గించినట్లు తెలిపింది. ఈ మేరకు కొత్త టారిఫ్ వివరాలను ఈఆర్‌సీ ఛైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి వెల్లడించారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ సంఘాల సూచనల మేరకు టారిఫ్‌పై నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇకపై గృహ వినియోగదారుడిపై కనీస ఛార్జీలు ఉండవని చెప్పారు. కనీస ఛార్జీల స్థానంలో కిలో వాట్‌కు రూ.10చెల్లిస్తే చాలని తెలిపారు. ఫంక్షన్ హాళ్లకు కూడా ఇకపై నిర్దిష్ట ఛార్జీలు ఉండవన్నారు.
పరిశ్రమల కేటగిరీలో ఆక్వా, పౌల్ట్రీ రంగాలను చేర్చబోమని జస్టిస్ నాగార్జునరెడ్డి తెలిపారు. రైతుల ఉచిత విద్యుత్‌కు రూ.7,297 కోట్లు భరించేందుకు ప్రభుత్వం సమ్మతించినట్లు చెప్పారు. పవన, సౌర విద్యుదుత్పత్తికి పీపీఏ బదులుగా తాత్కాలిక టారిఫ్ వర్తింపజేస్తామన్నారు. కులవృత్తులకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని.. దీనివల్ల రూ.1,657 కోట్ల భారం పడుతోందన్నారు. కొత్త టారిఫ్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఈఆర్‌సీ ఛైర్మన్ తెలిపారు.