ప్రైవేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు
టీడీపీకి తెలంగాణాలో పట్టిన గతి తప్పదు
తెలుగు తేజం, గుడివాడ : రాష్ట్రంలో 30 లక్షల పేదల ఇళ్ళపట్టాలను అడ్డుకున్న చంద్రబాబుకు రాజకీయ సమాధి కట్టాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి
నాని పిలుపునిచ్చారు. శుక్రవారం కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం భూషణగుళ్ళ
గ్రామంలో పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తో కలిసి మంత్రి కొడాలి నాని పాదయాత్ర చేపట్టారు ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిగ్గా మూడేళ్ళ కిందట రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాసంకల్ప యాత్ర పేరుతో జగన్మోహనరెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారన్నారు. అధికారంలో ఉండగా రూ .65 వేల కోట్ల అప్పులు చేసి చంద్రబాబు దిగిపోయాడన్నారు. వీటిని చెల్లిస్తూనే గత ఎన్నికల్లో జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయడం జరుగుతోందన్నారు. అధికారం చేపట్టిన ఏడాదిన్నరలోనే 90 శాతానికి పైగా హామీలను అమలు చేశారన్నారు. చంద్రబాబు మాత్రం తన
హయాంలో కట్టిన 2 లక్షల ఇళ్ళను ప్రజలకు ఇవ్వాలని అంటున్నారని, ఒకవైపు ఇళ్ళు ఇవ్వకుండా కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నాడన్నారు. పేదప్రజల పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకువస్తే దానివల్ల తెలుగు భ్రష్టు పట్టిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. అయినప్పటికీ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దామన్నారు.
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ. 6,400 కోట్లతో అమ్మఒడి పథకాన్ని అమలు చేశారన్నారు. రైతు భరోసా కింద ప్రతి ఏటా రైతుకు రూ .13,500 లు చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో 42 లక్షల మంది పెన్షనర్లకు 60 నెలల్లో కేవలం రూ .3,350 కోట్లు ఇచ్చారని, చివరి ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరో 4 లక్షల పెన్షన్లు మంజూరు చేశారన్నారు. జగన్ము ఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కొత్తగా 11 లక్షల పెన్షన్లను మంజూరు చేశారన్నారు. పెన్షనర్లను కూడా చంద్రబాబు ఓటర్లుగానే భావించారన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి ఆత్మ స్టైర్యం, మనోసైర్యాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోవాల్సిందేనని చెప్పారు. ఇప్పటికే చంద్రబాబు ప్రజల ఛీత్కారానికి గురయ్యారని, తెలంగాణాలో పట్టిన గతే ఆంధ్రప్రదేశ్ లో కూడా పడుతుందన్నారు. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పెదపారుపూడి మండలం ఒకప్పుడు గుడివాడ నియోజకవర్గంలో ఉండేదని, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో కూడా టీడీపీ తరపున పోటీ చేసిన తనకు భూషణగుళ్ళ గ్రామం నుండి 1300 మెజార్టీ వచ్చిందన్నారు. ఈ గ్రామాన్ని గుడివాడ మున్సిపాలిటీలో కలిపామని, అయితే కొంత మంది కోర్టులకు వెళ్ళి అడ్డుకున్నారన్నారు. విలీన ప్రక్రియపై అసెంబ్లీలో సీఎం జగన్మోహనరెడ్డి బిల్లు పెట్టనున్నారని, ఆ తర్వాత భూషణగుళ్ళ గ్రామంలో అన్ని మౌలిక వసతులను కల్పిస్తానని మంత్రి కొడాలి నాని చెప్పారు.
పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చినట్టుగా ప్రజల ముందు నటించారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే 90 శాతం హామీలను నెరవేర్చారని, వీరిద్దరి పాలన చూసిన ప్రజలు జగన్కు అండగా నిలుస్తున్నారని
చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, వైసీపీ నాయకులు రాంప్రసాద్, చంటి, ఎండీవో యద్దనపూడి రామకృష్ణ, మండల తహసీల్దార్ ఎంజీ సత్యనారాయణ,
వైసీపీ మండల కన్వీనర్ సురేష్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణ, సోమేశ్వరరావు,దేదీప్య, రాంబాబు, నాగరాజు, శేఖర్, వెంకటేశ్వరరావు, సుజాత, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.