విజయవాడ:
తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు ముమ్మాటికి అప్రజాస్వామికమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా దేవినేనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భవానీపురం పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” రాష్ట్రంలో తెదేపా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజలు చంద్రబాబు అరెస్టుపై ఆందోళన చెందుతున్నారు. కేవలం సీఎం జగన్ రెడ్డి కళ్లలో ఆనందం కోసమే పోలీసు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇలా వేలాది మంది పోలీసులతో తెదేపా నాయకులను నిర్బంధిస్తున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రజా తిరుగుబాటు తప్పదు. తాడేపల్లిలోని సజ్జల పర్యవేక్షణలోనే ఈ అక్రమ గృహ నిర్బంధాలు, అరెస్టులు జరుగుతున్నాయి” అని విమర్శించారు.