నూజివీడు : టిడిపి జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమ చర్యగా మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు అన్నారు. నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టిడిపి శ్రేణులతో కలిసి శనివారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కాపా మాట్లాడుతూ ఎంతో అనుభవం కలిగిన రాజకీయ నేతగా దేశ విదేశాలలో ఖ్యాతి గడించిన చంద్రబాబును అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడం దారుణం అన్నారు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి ప్రజలను మోసగించి ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని, కుట్రలు పన్నితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. క్రమశిక్షణ గల నీతివంతమైన పార్టీగా తెలుగుదేశం పార్టీ పేదల అభ్యున్నతే ధ్యేయంగా సాగుతున్నట్లు చెప్పారు. అవినీతి మరక అంటని కొద్ది మంది నాయకులలో నారా చంద్రబాబు నాయుడు ముందు వరుసలో ఉంటారని చెప్పారు. డాక్టర్ వైయస్సార్ ఎన్నో కేసులు పెట్టి నిరూపించలేక ఊరుకున్నారని, ప్రపంచంలో ఏ ఒక్కరూ చంద్రబాబుకు అవినీతి మరక అంటించలేరని స్పష్టం చేశారు. చంద్రబాబును విడుదల చేసే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి అన్నారు.
పట్టణంలో ముద్రబోయిన ఆందోళన :
నూజివీడు పట్టణంలోని ప్రధాన రహదారులలో నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావు నాయకత్వంలో టిడిపి శ్రేణులతో కలసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ముద్రబోయిన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఏ తప్పు చేయని చంద్రబాబును అరెస్టు చేస్తే ప్రజలు ఎవరూ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. తక్షణమే చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ద్విచక్ర వాహనం దగ్ధం:
చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో ఆందోళనకారులు నూజివీడు పట్టణంలోని చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టారు. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హుటాహుటిన వచ్చిన పోలీసులు మంటలను అదుపు చేసి వాహనాన్ని, ఆందోళనకారులను అదుపులోకి తీసుకొన్నారు.