సవరణలకు ఓకే: ప్రభుత్వం
9న మరోసారి భేటీ
చర్చలు మళ్లీ విఫలం
రద్దు చేయాల్సిందే: రైతులు
న్యూఢిల్లీ : అదే ప్రతిష్టంభన.. అదే వైఖరి.. 10 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలతో ప్రభుత్వం జరిపిన మలి దఫా చర్చలు కూడా ఏ ఫలితాన్నీ ఇవ్వలేదు. శనివారంనాటి చర్చల్లో ఏ విషయమూ తేలిపోతుందని అంతా భావించినా.. ఇరుపక్షాలూ తమ వైఖరికే కట్టుబడడంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. రైతులు లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చించుకుని ఓ నిర్ణయానికి రావడానికి గడువు కావాలని, 9వ తేదీన మళ్లీ సమావేశమవుదామన్న ప్రభుత్వ ప్రతిపాదనను రైతులు అంగీకరించారు. శనివారం 35 రైతు సంఘాల ప్రతినిధులతో ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, వాణిజ్య, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోం ప్రకాశ్ చర్చలు జరిపారు. చట్టాల్లోని 39 అంశాలపై అభ్యంతరాలను రైతులు సర్కారుకు మళ్లీ వివరించారు. గత చర్చలకు సంబంధించి అంశాల వారీగా ప్రభుత్వ అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని రైతు సంఘాల నేతలు కోరారు. దీంతో కేంద్ర మంత్రులు లిఖితపూర్వకంగా అందించారు. వాటిని పరిశీలించిన రైతులు కొత్త చట్టాలను రద్దు చేయాలని పట్టుబట్టారు. కేంద్ర మంత్రులు మాత్రం చట్టాల్లో సవరణలకే మొగ్గుచూపారు. ఇదే వైఖరి కొనసాగిస్తే సమావేశం నుంచి బయటకు వెళ్లిపోతామని రైతు నేతలు హెచ్చరించారు. తమ వద్ద ఏడాదికి సరిపడా సరుకు లున్నాయని, తాము రోడ్లపైనే ఉండాలని ప్రభుత్వం భావిస్తే సిద్ధమే అన్నారు. మంత్రులు తమ డిమాండ్లపై సరిగ్గా స్పందించడం లేదన్న కోపంతో రైతులు సమావేశంలో మౌన దీక్ష చేశారు. చివరికి ఏ నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది. శనివారం కూడా రైతుల సంఘాల నేతలు ప్రభుత్వ లంచ్‌ను తిరస్కరించారు.
సర్కారు స్పందించట్లేదు: కవితా కూరుగంటి
కొత్త చట్టాలపై తమ డిమాండ్లతో పాటు తాము లేవనెత్తిన అంశాలు, ప్రశ్నలకు కేంద్ర మంత్రులు స్పందించలేదని చర్చల్లో పాల్గొన్న అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ ప్రతినిధి కవితా కూరుగంటి తెలిపారు. ‘‘కొత్త చట్టాల ను రద్దు చేస్తారో.. లేదో.. అనే విషయాన్ని ‘అవును లేదా కాదు’ అనే ఒకే పదంలో చెప్పాలని అడిగినా మంత్రులు స్పందించలేదు. అందుకే మేం మౌన దీక్ష వహించాం’’ అని ఆమె వెల్లడించారు. కాగా, రైతు సంఘాల నేతలతో చర్చలకు ముందు మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రైతుల నిరసనలు, వారి డిమాండ్లను ప్రధానికి వివరించి.. పరిష్కార మార్గాలపై చర్చించారు. అవసరమైతే పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపరచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రైతుల సహేతుకమైన డిమాండ్లను ఒప్పుకుంటూ సవరణలు తేవాలన్నది యోచన. ప్రధాన 4 సవరణలను ప్రతిపాదిస్తున్నారు. 1. ఎంఎస్పీ వ్యవస్థను కట్టుది ట్టం చేసి, అది కొనసాగేట్లు మార్పులు. కనీసం 22 ముఖ్యమైన పంటలకు ఎంఎస్పీ కచ్చితంగా అమలయ్యేట్లు చూడా లి. 2. ఏపీఎంసీల వద్ద సేకరణ పకడ్బందీగా కొనసాగేట్లు కొత్త నిబంధనలు తేవాలి.
మూడు సాగు చట్టాల్లో అత్యంత కీలకమైన ఫా ర్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ చట్టం ప్రకా రం రాష్ట్రాల అదుపులోని వ్యవసాయ మార్కెటింగ్‌ను కేంద్ర చట్టం పక్కన పడేస్తోంది. దీనిపైనే రైతుల అభ్యంతరం. దీనిలో సవరణలకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. 3. కొత్త ప్రైవేటు వ్యాపారులు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకుని ఉండాలన్న నిబంధన 4. వివాదాల పరిష్కారాన్ని సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ కోర్టు నుంచి సివిల్ కోర్టులకు అప్పగించడం. కాగా, రైతుల ఆందోళనకు పూర్తి మద్దతునిస్తున్నట్లు సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్, సీపీఐ(ఎంఎల్) మొదలైన వామపక్షాలు సంయుక్తంగా ప్రకటించాయి. సాగు చట్టాలను, విద్యుత్ సవరణ చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశాయి.