Breaking News

10న పార్లమెంటు కొత్త భవనానికి భూమి పూజ

దిల్లీ: పార్లమెంట్‌ కొత్త భవనం శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. భవిష్యత్తు అవసరాల కోసం ప్రస్తుత భవనం చాలదన్న ఉద్దేశంతో నిర్మించ తలపెట్టిన ఈ భారీ భవన నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబర్‌ 10న భూమిపూజ నిర్వహించేందుకు ప్రధానిని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం ఆయన మోదీ నివాసానికి వెళ్లి అధికారికంగా ఆహ్వానించారు. అనంతరం ఓం బిర్లా కొత్త భవనానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు.

భూకంపాలను తట్టుకొనేలా..

పాత భవనం సరిపోవడం లేదన్న ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగంతస్తుల్లో భారీ సౌధాన్ని నిర్మించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. గుజరాత్‌కు చెందిన హెచ్‌సీపీ డిజైన్‌, ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ దీని ఆకృతులు రూపొందిస్తుండగా, టాటా సంస్థ నిర్మాణ పనులు చేపడుతోంది. పనులను 2022 అక్టోబర్‌ నాటికి పూర్తిచేయాలని కేంద్రం సంకల్పించింది. ప్రస్తుతం ఉన్న భవనం కంటే 17వేల చదరపు మీటర్ల అదనపు విస్తీర్ణంలో పూర్తి అధునాతన వ్యవస్థలతో నిర్మిస్తున్న ఈ కొత్త భవనం భూకంపాన్ని సైతం తట్టుకొనేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్టు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వెల్లడించారు.

పెరగనున్న సభ్యులు

ప్రస్తుత పార్లమెంట్ భవనం నిర్మించి వందేళ్లు పూర్తవుతోందని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. స్వతంత్ర భారత్‌లో కొత్త పార్లమెంట్‌ భవనం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కొత్త భవనంలో ఆధునాతన భారత శిల్పకళా నైపుణ్యం దర్శనమిస్తుందని వెల్లడించారు. రానున్న కాలంలో సభ్యుల సంఖ్య పెరుగుతుందన్న ఆయన.. ఆ మేరకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈ భారీ భవన నిర్మాణంలో 2వేల మంది ప్రత్యక్షంగా, 9వేల మంది పరోక్షంగా పాల్గొంటారని వివరించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *