ముంబయి: దురాక్రమణ బుద్ధిగల చైనా ఎత్తుగడలకు విరుగుడుగా భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌లో బ్రహ్మపుత్ర నదిపై 10 గిగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని తెలిసింది. కేంద్ర ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయికి సంబంధిత దస్త్రం చేరినట్టు అధికారులు చెబుతున్నారు.
టిబెట్ నుంచి ఉద్ధృతంగా ప్రవహించే బ్రహ్మపుత్రా నదిని చైనాలో యార్లుంగ్ సాంగ్బో అంటారు. ఈ నదిపై భారత్‌కు ఎగువన 60 గిగావాట్ల సామర్థ్యం గల జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మించేందుకు డ్రాగన్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇదే జరిగితే నీటి కరవు లేదా అకాల వరదలు సంభవిస్తాయని భారతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. దిగువనున్న దేశాలకు ఎలాంటి ముప్పు కలగకుండా నిర్మిస్తామని డ్రాగన్ హామీ ఇస్తున్నా ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. ఉద్దేశపూర్వకంగానే గిల్లికజ్జాలు పెట్టుకొనే దాని నైజమే ఇందుకు కారణం. అంతేకాకుండా గతంలో చైనా నిర్మించిన ఆనకట్టల వల్ల దిగువనున్న దేశాలు కరవు కోరల్లో చిక్కుకున్నాయి.
‘చైనా నిర్మిస్తున్న ఆనకట్టలు, ప్రాజెక్టుల వల్ల ముప్పును నివారించాలంటే అతి త్వరగా అరుణాచల్ ప్రదేశ్‌లో డ్యామ్ నిర్మించడం అవసరం. ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో మా ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. మీరు నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల భారత్‌కు ఎలాంటి ముప్పు ఉండకూడదని చైనాకు మేం అధికారికంగా చెప్పాం. వాళ్లు మాకు హామీ ఇచ్చారు. కానీ వారు ఎంతకాలం కట్టుబడి ఉంటారో మనకు తెలియదు’ అని కేంద్ర జల మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి టీఎస్ మెహ్రా అంటున్నారు. ఇప్పటికే లద్దాఖ్ ప్రాంతంలో రెండు దేశాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో చైనాకు ఎదురునిలిచి ప్రాజెక్టు నిర్మిస్తే ‘జల యుద్ధాలు’ జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.