దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతాంగం నిరసన కొనసాగుతూనే ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ కమిటీ ఆధ్వర్యంలో దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సీఎం కేజ్రీవాల్ పాల్గొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలపై తమ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. కనీస మద్దతు ధరల చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ఈ పోరాటంలో దిల్లీ మొత్తం రైతుల వైపే నిలుస్తుందని ఓ సీఎంగా హామీ ఇస్తున్నానన్నారు. రైతుల నిరసనలకు మద్దతు ప్రకటించారు. కొన్ని పార్టీలు ఈ చట్టాలపై రాజకీయాలు చేస్తున్నాయన్న కేజ్రీవాల్.. దేశంలోని రైతులను భాజపా మోసగిస్తోందని ఆరోపించారు.
ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని భాజపా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక అందుకు పూర్తి విరుద్ధంగా పనిచేస్తోందని ఆక్షేపించారు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు స్వామినాథన్ నివేదికను అమలు చేస్తామన్నారని, ఎన్నికల్లో గెలిచాక ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. దిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పాటయ్యే సరికి ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉండేదన్నారు. ఆ సమయంలో తమ ప్రభుత్వం వాటిని మూసివేయకుండా మెరుగుపరిచిందని గుర్తు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆప్ నేత సంజయ్‌సింగ్, ఎంపీ భగవంత్ మాన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.