విజయవాడ: రాష్ట్రంలో కోవిడ్ బారినపడి మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకొచ్చారని, ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేసేందుకు హామీ ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ వెల్లడించారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.
కరోనా కారణంగా ఏపీలో 38 మంది జర్నలిస్టులు మృతిచెందటం బాధాకరమన్నారు. వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేయగానే.. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా, ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐవీ సుబ్బారావు, చందు జనార్థన్లు కూడా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.