అహ్మదాబాద్: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిపై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడు నగరాల పర్యటన ప్రారంభమైంది. శనివారం ఉదయం ఆయన గుజరాత్‌లోని అహ్మదాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా జైడస్ క్యాడిలా కర్మాగారానికి బయల్దేరారు. జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేస్తున్న ‘జైకోవ్-డి’ టీకా ప్రయోగాలను మోదీ పరిశీలించనున్నారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ రెండో దశ ప్రయోగాల్లో ఉంది.
అహ్మదాబాద్ తర్వాత ప్రధాని మోదీ.. హైదరాబాద్, పుణెల్లో పర్యటించనున్నారు. హైదరాబాద్‌లో భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న ‘కొవాగ్జిన్’, పుణెలో ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి సీరం సంస్థ అభివృద్ధి చేస్తున్న ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్ ప్రయోగాలను మోదీ పరిశీలించనున్నారు. మోదీ పర్యటన వివరాలను ప్రధాని కార్యాలయం ట్విటర్ ద్వారా వెల్లడించింది. కరోనాపై పోరులో భారత్ నిర్ణయాత్మక దశకు చేరుకున్న సమయంలో వ్యాక్సిన్ సన్నద్ధతపై శాస్త్రవేత్తలతో చర్చించేందుకు ప్రధాని ఈ పర్యటన చేపట్టినట్లు తెలిపింది. టీకా అభివృద్ధి, ఎదుర్కొంటున్న సవాళ్లు, దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి మార్గసూచీ వంటి అంశాలను ప్రధాని ఈ పర్యటనలో సమీక్షించనున్నట్లు పేర్కొంది.