తిరుమల : టీటీడీ నూతన ఈఓగా ఐఏయస్ అధికారి డాక్టర్ జవహర్ రెడ్డి శనివారం భాద్యతలు చేపట్టారు. ఉదయం అలిపిరి నుంచి నడకదారిలో తిరుమలకి చేరుకున్నారు. అనంతరం 12 గంటలకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈఓ ధర్మారెడ్డి నుంచి పదవీబాధ్యతలు తీసుకున్నారు. జవహర్ రెడ్డి భాద్యతలు చేపట్టాకా మరోసారి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. షేత్ర సాంప్రదాయం ప్రకారం ముందుగా వరాహస్వామిని దర్శించుకొని అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. తిరుమల శ్రీవారికి సేవ చేసే భాగ్యం కలగడం చాలా సంతోషంగా ఉందని, ఎంతో పుణ్యఫలం చేస్తే గానీ ఈ అవకాశం దక్కదని పేర్కొన్నారు. ‘శ్రీవారి పాదాల చెంత నేను చదువును పూర్తి చేశాను. భక్తుల సౌకర్యార్థం ప్రస్తుత్తం ఉన్న పద్దతులను మరింత పటిష్టం చేస్తానని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో భక్తుల కోసం నూతన సంస్కరణలు తీసుకొస్తానని తెలిపారు. పూర్తి జాగ్రత్తలు తీసుకొని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తే కరోనా వ్యాప్తి అరికట్టవచ్చన్నారు. అన్లాక్ 5లో భాగంగా మినహాయింపులు ఇచ్చారని, టీటీడీ ఉన్నత అధికారులతో బ్రహ్మోత్సవాలపై సమావేశం నిర్వహించి తగిన సూచనలు తెలియజేస్తామని ఈవో కేఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.