న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో ఢిల్లీ ప్రభుత్వం మరోసారి ఆంక్షలు విధించింది. లాక్డౌన్ విధించే అవకాశాలున్నాయన్న ఊహగానాలు వ్యాప్తిస్తున్నతరుణంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా స్పందించారు. ఢిల్లీలో లాక్డౌన్ విధించే అవకాశంలేదని స్పష్టం చేశారు. అయితే ఒకే ప్రదేశంలో ఎక్కువమంది గుమిగూడకుండా ఉండాలని సూచించారు. అలాగే వివాహ అతిధుల సంఖ్యను 50 మందికి పరిమితం చేసినట్టు తెలిపారు. గరిష్టంగా 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఇందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్అనుమతి లభించినట్టు వెల్లడించారు. అంతకుముందు ఇది 200గా ఉంది.
దేశ రాజధానిలో ప్రస్తుతం మూడో దశ కొనసాగుతున్నసంగతి తెలిసిందే. అటులాక్డౌన్ విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదంటూ ఈ ఊహాగానాలకు చెక్ పెట్టారు రాష్ట్ర ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్. కానీ ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడటం చాలా హానికరమని, అందుకే దీన్ని నివారించాలని సూచించారు. కరోనాపై పోరుకు లాక్డౌన్ పరిష్కారం కాదని తాము నమ్ముతున్నామన్నారు. ఈ మేరకు దుకాణదారులు భయపడాల్సిన అసరం లేదంటూ సత్యేంద్ర జైన్ భరోసా ఇచ్చారు. షాపులు తెరుచుకోవచ్చుగానీ, నిబంధనలు పాటించాలన్నారు. అలాగే ఛత్ పూజా సందర్బంగా పెద్ద ఎత్తున జనాలు ఒకే చోట చేరితే వైరస్ సులభంగా వ్యాప్తి చెందుతుంది అందకే ఆంక్షలు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు.