తెలుగు తేజం, ఆంధ్రప్రదేశ్‌లో రాగల రెండు రోజుల్లో అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కె.కనకబాబు తెలిపారు. ఏప్రిల్ 1 రాష్ట్రంలోని 113 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 217 మండలాల్లో వడగాల్పులు ఉంటాయని తెలిపారు. అదే విధంగా ఏప్రిల్ 2వ తేదీన రాష్ట్రంలో 148 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 207 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఉష్ణోగ్రతల కారణంగా విపత్తు నిర్వహణ శాఖ జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. తీవ్రమైన వడగాల్పుల కారణంగా మహిళలు, పిల్లలు, వృద్దులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. అయితే డీహైడ్రేట్‌కు గురి కాకుండా ఓఆర్ఎస్లు, ఇంట్లో తయారు చేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలని తెలిపారు. అలాగే ఈ వేసవి కాలంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా అధికంగా నీరు తాగాలని ఆయన సూచించారు.
ఒక పక్క కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్న తెలుగు రాష్ట్రాలకు రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రతరం కానున్నాయి. ఈ సారి తెలుగు రాష్ట్రాల్లో ఎండలు విపరీతంగా మండిపోతాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. వాయవ్య దిశ నుంచి వీస్తున్న గాలులే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఉష్ణోగ్రతల పెరుగుదల మరింత అధికమవుతుందని అధికారులు వివరిస్తున్నారు.
అయితే దేశ వ్యాప్తంగా భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో జనాలు విలవిలలాడిపోతున్నారు.అత్యవసరం అయితే తప్ప ఎండలో బయటకు తిరగకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కడికెళ్లిన బాటిల్లో వాటర్ ఉంచుకోవడం మంచిదంటున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే క్యాప్స్ ధరించాలని, గొడుగులు వాడాలని జాగ్రత్తలు చెప్పారు. ఈ సమ్మర్ లో డీహైడ్రేషన్ బారిన పడే చాన్స్ ఎక్కువగా ఉంటుంది. దీంతో తగినంత నీరు తీసుకోవాలన్నారు. దాహం తీర్చుకునేందుకు కూల్ డ్రింక్స్ బదులు కొబ్బరి బొండం, మజ్జిగ తాగడం మంచిదన్నారు.