దిల్లీ: దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే దీపావళి పర్వదినం సందర్భంగా స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశీయ ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలనే నినాదంతో చాలారోజుల నుంచి ప్రధాని ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పండుగ సందర్భంగా దేశీయ ఉత్పత్తులకు ఊతమిచ్చేందుకు వాటిని ఖరీదు చేయాలని ప్రధాని దేశ ప్రజలను కోరారు. వీటిని కొనడం ఆర్థికవ్యవస్థకు నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుందని ప్రధాని స్పష్టంచేశారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారణాసిలో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని, స్థానిక ఉత్పత్తులపై మరోసారి దేశప్రజలకు సూచించారు. దీపావళి పండుగ సందర్భంగా ఆయన దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులను ప్రతివ్యక్తి గర్వంగా కొనడం, వాటి గురించి ఇతరులకు వివరించడం, వాటి గొప్పదనాన్ని చాటిచెప్పినప్పుడే మన స్థానిక ఉత్పత్తులు మంచివనే అభిప్రాయం కలుగుతుందని ప్రధాని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ సందేశం ఎంతో మందికి చేరుతుందన్నారు. కేవలం దీపాలనే కాకుండా పండుగ సమయంలో వినియోగించే అన్ని వస్తువులు స్థానికమైనవే వాడాలని మోదీ విజ్ఞప్తిచేశారు. తద్వారా స్థానిక ఉత్పత్తులకు గుర్తింపు పెరగడమే కాకుండా, వాటిని తయారు చేసే వారి కుటుంబాల్లోనూ కాంతిని తీసుకొస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.