తెలుగు తేజం, విజయవాడ:నఖిలి ఆధార్ కార్డులు తయారు చేసే ముఠాను అరెస్ట్ చేశామని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. ఈ కేసులో జిల్లాలో ఆరుగురు అరెస్ట్ చేశామని, పరారీలో మరికొందరు నిందితులున్నారని ఎస్పీ ప్రకటించారు. రూ. 5 వేలకు నకిలీ ఆధార్ కార్డు ముఠా తయారు చేస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. గుడివాడ, తిరువూరులో ఆధార్ కార్డును ట్యాంపరింగ్ చేస్తున్నట్టు గుర్తించామని, ప్రభుత్వం అందించే వివిధ రకాల ప్రజా సంక్షేమ పథకాల కోసం అక్రమాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని రవీంద్రనాథ్‌బాబు హెచ్చరించారు.
తిరువూరులో ఆధార్ కేంద్రంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఆధార్ కార్డు మరియు పాన్‌కార్డ్ డేటా బేస్‌లలో వయస్సు మార్పులు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనర్హులకు లబ్ది చేకూర్చి ప్రభుత్వ ఆదాయానికి నిర్వాహకులు గండికొట్టారు. ఆధార్ సెంటర్ నిర్వాహకుడు మరియు అతనికి సహకరించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు ప్రకటించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి వద్ద నుండి కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరపర్చారు. న్యాయమూర్తి నిందితులకు రిమాండ్ విధించారు. దీంతో నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.