తెలుగు తేజం, జగ్గయ్యపేట : ఉపాధ్యాయులు నిరంతర విద్యార్థిగా ఉన్నప్పుడే వృత్తి లో మరింత రాణించగలుగుతారు అని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ అన్నారు. శుక్రవారం స్థానిక స్వచ్ఛంద సంస్థ కర్ల పాటి చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో గత ఐదు రోజులుగా జరుగుతున్న ఐ సి డి ఎస్ అంగన్వాడి మరియు మహిళ సంరక్షణ కార్యదర్శుల శిక్షణా తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంగన్వాడీ కార్యకర్తలు బాల్యదశలో బాలబాలికల్లో కలిగించే ప్రేరణ భవిష్యత్ అవసరాలను అధిగమించేలా ఉండాలని సూచించారు. శిక్షణా తరగతులకు సహకారాన్ని అందిస్తున్న కర్ల పాటి చారిటబుల్ ట్రస్ట్ ను ఆయన అభినందించారు. సామాజికవేత్త కర్ల పాటి వెంకట శ్రీనివాసరావు ప్రభుత్వం , ప్రభుత్వేతర సంస్థలు సమన్వయంతో పని చేసినప్పుడే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను త్వరితగతిన సాధించగలమని అన్నారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉషారాణి మహిళా కార్యదర్శుల బాధ్యతలను వివరించారు. సి డి పి ఓ శ్రీమతి గ్లోరీ ఐదు రోజుల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కాగా ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు మహిళా సంరక్షణ అధికారులు మాస్టర్ ట్రైనర్ లక్ష్మీకాంతం, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.