తక్కెళ్లపాడులో భూహక్కు, భూరక్ష పథకం ప్రారంభం
తెలుగు తేజం, జగ్గయ్యపేట : భూముల రీ సర్వే జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభంకానుంది. పైలెట్ ప్రాజెక్టు కింద జగ్గయ్యపేట మండలంలో అధికారులు రీ సర్వే పూర్తిచేయగా, తక్కెళ్లపాడు గ్రామం నుంచి ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రవ్యాప్తంగా ‘జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో అధికారికంగా ప్రారంభించనున్నారు. విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని జగ్గయ్యపేట మండలం షేర్మహ్మద్పేట, మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలో మచిలీపట్నం మండలం పొట్లపాలెం, గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో గుడివాడ మండలంలోని మెరకగూడెం, నూజివీడు రెవెన్యూ డివిజన్ పరిధిలో నూజివీడు మండలం మర్రిబంధం గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. జిల్లావ్యాప్తంగా 1,005 గ్రామాల్లో ఈ సర్వే జరగనుండగా, తొలిదశలో మాత్రం 332 గ్రామాల్లో సోమవారం నుంచి భూ సర్వే ప్రారంభిస్తారు.