తెలుగు తేజం, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. బంగారు కవచం ధరించి.. సువర్ణ కాంతులిస్తూ భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తారు. తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ అనంతరం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కాగా అమ్మవారి దర్శనానికి రోజుకు 10వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. స్లాట్ బుక్ చేసుకున్న భక్తులకే అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఆర్జిత సేవలను పరోక్షంగా నిర్వహిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో దుర్గగుడి వద్ద కృష్ణానదిలో పుణ్యస్నానాలపై దేవదాయశాఖ ఆంక్షలు విధించింది.
కోవిడ్ నేపథ్యంలో ఇవీ మార్గదర్శకాలు..
► మాస్క్ ధరించి, ఆన్లైన్ టికెట్, ఐడీ కార్డు ఉంటేనే క్యూలైన్లోకి అనుమతిస్తారు. పదేళ్లలోపు చిన్నారులను, 60 ఏళ్లు దాటిన వారిని దర్శనానికి అనుమతించరు.
► దగ్గు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండే వారిని జర్వంతో బాధపడుతున్నదీ లేనిదీ పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే క్యూలైన్లోకి అనుమతిస్తారు. క్యూలైన్లో ఇతరులు తాకిన వస్తువులు తాకవద్దంటూ బోర్డులను ఏర్పాటు చేశారు.
► భక్తులు మంచినీటి బాటిల్స్ తెచ్చుకోవాలి. అత్యవసరాల కోసం క్యూలైన్లో మంచినీటి క్యాన్లు ఉంచారు. దుర్గాఘాట్, ఇతర ఘాట్లలో పుణ్యస్నానాలు, తలనీలాల సమర్పణ నిషేధించారు.
► భక్తులు తమ గ్రామాల్లోనే దీక్షల ఇరుముడులు సమర్పించాలి.