పండు వెన్నెల్లో.. వైభవంగా తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణం
తెలుగు తేజం, పెనుగంచిప్రోలు : పెనుగంచిప్రోలు క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీగోపయ్య సమేత శ్రీలక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. విద్యుత్ దీప కాంతులతో, మేళతాళాల మధ్య, భక్తుల కనులకు విందుగా వరుడు గోపయ్య స్వామి, వధువు తిరుపతమ్మతల్లి పెళ్ళిమండపంపై ఆశీనులు కాగా వరుడి తరఫున కాకాని వంశీకులు, వధువు తరఫున కొల్లా వంశీకులు పెళ్లి పెద్దలగా వ్యవహరించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి గోపయ్యస్వాముల కళ్యాణం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో జగ్గయ్యపేట శాసనసభ్యులు ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను-విమలాభాను దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు అందజేశారు. వేదికపై నందిగామ డిఎస్పీ నాగేశ్వర రెడ్డి దంపతులు, గ్రామ సర్పంచ్ వేల్పుల పద్మావతి-రవికుమార్ దంపతులు, ఆలయ ఈఓ యస్ వి యస్ ఎన్ మూర్తి, వేదపండితులు, ఆలయ అర్చకులు, వైస్సార్సీపీ నాయకులు మాజీ ఎమ్ పి పి గుడపాటి శ్రీను, మండలపార్టీ అధ్యక్షులు వూట్ల నాగేశ్వరావు, గ్రామపార్టీ కాకాని హరిబాబు, ఆలయ అధికారులు అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు.
అఖండ జ్యోతి స్థాపన చేసిన తర్వాత ఇరుముడులు సమర్పించే దీక్ష స్వాములతో గ్రామంలోని ప్రధాన వీధులన్నీ ఎరుపెక్కాయి.
ఇరుముడులు సమర్పించిన దీక్ష స్వాములు వారి కుటుంబ సభ్యులు అమ్మవారి కళ్యాణాన్ని కన్నుల విందుగా వీక్షించి తిరిగి ప్రయాణం అయ్యారు.