ఆగిరిపల్లి : ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలోని హీల్ పారడైజ్ లో అనాధ పిల్లలు, తల్లి లేదా తండ్రి లేని పిల్లలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలకు ఓ గొప్ప అవకాశాన్ని అందిస్తున్నట్లు అడ్మిషన్స్ నిర్వాహకులు కరుణ బాబు తెలిపారు. హిల్ పారడైజ్ లో ఆయన మంగళవారం మాట్లాడుతూ ఇంటర్మీడియట్ లో ఎంపీసీ, ఎం ఇ సి, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఓ చక్కని అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశానికి విద్యార్థులు చదివిన కోర్సులో కనీసం 70 శాతం మార్కులు సాధించిన వారు అర్హులని అన్నారు. ఇందుకోసం మొదటి రౌండులో కంప్యూటర్లో పరీక్ష ఉంటుందని, అది హిల్ పారడైజ్ క్యాంపస్లో నిర్వహించటం జరుగుతుందన్నారు. అర్హులైన అభ్యర్థులు రాయవలసిన పరీక్షలోనే వివరాలను వరుసగా తెలియజేశారు. కంప్యూటర్ పరీక్షలో మ్యాథమెటిక్స్, రీజనింగ్ (నెంబర్ సిరీస్, అనాలజీ, ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్, బ్లడ్ రిలేషన్స్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్), ఆప్టిట్యూడ్ (ట్రైన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్ షిప్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, క్యాలెండర్), కంప్యూటర్ నాలెడ్జ్, లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ వంటి అంశాలలో పరీక్ష నిర్వహించటం జరుగుతుందన్నారు. పరీక్షలో పాసై యాప్ డెవలప్మెంట్, డిజిటల్ కంటెంట్ ఎంగేజ్మెంట్ లలో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. ఇందుకోసం ఈనెల 20వ తేదీ వరకు ప్రతిరోజు రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత సదుపాయాలతో కోర్సు నేర్పడం జరుగుతుందన్నారు. ఉద్యోగం పొందేందుకు ప్రత్యేక శిక్షణను కూడా ఇవ్వనున్నట్లుగా వివరించారు. ఈ సదవకాశాన్ని అర్హులైన విద్యార్థులందరూ వినియోగించుకోవాలని సూచించారు.