కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
సమస్యాత్మకమైన గ్రామాలను గుర్తించిన కృష్ణా జిల్లా ఎస్పీ
తెలుగు తేజం, నందిగామ : నందిగామ రూరల్ పరిధిలోని కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు మండలాలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలీస్ రక్షణ వలయంలో నిఘా నేత్రం లో ఉంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక అతి సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ఇప్పటికే పలుమార్లు కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆయా గ్రామాలలోని పోలింగ్ బూతుల ను పర్యవేక్షించి ఆయా గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. అలాగే అలజడులు సృష్టించే వాళ్ళని గుర్తించి వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. కాగా గతంలో ఎన్నడూ లేనివిధంగా సమస్యాత్మకమైన గ్రామాల్లో పోలింగ్ బూత్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలీస్ బాడీ కెమెరా కూడా ఎలక్షన్ కి తీసుకు రావడం జరిగింది. కంచికచర్ల మండలం లోని కంచికచర్ల పరిటాల, గొట్టుముక్కల, గని అత్కూరు, కునికినపాడు, మొగులూరు, వేములపల్లి, పెండ్యాల, కీసర వీరులపాడు మండలం లోని జుజ్జూరు, పెద్దాపురం, అల్లూరు, దాసారం, పొన్నవరం చందర్లపాడు మండలం లోని చందర్లపాడు, ముప్పాళ్ళ, తోర్లపాడు, కొనయపాలెం, రామన్నపేట తదితర సమస్యాత్మకమైన గ్రామాలను గుర్తించడం జరిగిందని, ఆయా గ్రామాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో నందిగామ డిఎస్పీ నాగేశ్వర్రెడ్డి, రూరల్ సీఐ సతీష్ కంచికచర్ల ఎస్సై రంగనాథ్, ఎస్ ఐ 2 శ్రీమతి లక్ష్మి ,చందర్లపాడు ఎస్సై ఏసోబు ,వీరులపాడు ఎస్సై మణికుమార్ వారి సిబ్బందితో కలిసి ప్రతి గ్రామంలో పోలీసు కవాతు నిర్వహించి ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎటువంటి ప్రలోభాలకు పాల్పడవద్దని తెలియజేయడం జరిగిందని, ఎన్నికల సమయంలో గొడవలకు కారకులైన వారిని ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదని, వారిపై బైండోవర్ తోపాటు రౌడీషీట్ ఆపై పిడియాక్ట్ కూడా అమలులోకి తీసుకు రావడం జరుగుతుందని హెచ్చరించారు.