Breaking News

ప్రత్యేక సమావేశాలపై ఉత్కంఠ.. 17న అఖిలపక్షం భేటీ!

దిల్లీ: ఈ నెలలో ఐదురోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా నిర్ణయించడం దేశ రాజకీయాల్లో ఇటీవల చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఎజెండా ఏంటనే విషయాన్ని వెల్లడించకపోయినప్పటికీ.. అందులో ‘ముఖ్యమైన’ అంశాలున్నాయని చెప్పడంతో వీటిపై మరింత ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 17న అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్‌ 18 నుంచి మొదలుకానున్నాయి. అంతకుముందు రోజు 17న సాయంత్రం.. అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన ఆహ్వానం ఆ పార్టీల నేతలకు ఈ మెయిల్‌ ద్వారా పంపించాం’ అని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఎక్స్‌ (ట్విటర్‌)లో వెల్లడించారు. సెప్టెంబర్‌ 18 నుంచి 22 వరకు ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఎజెండాలో ఏయే అంశాలు ఉన్నాయని చెప్పలేదు. కానీ, అందులో ‘ముఖ్యమైన’ అంశాలున్నాయని.. వాటిని సిద్ధం చేస్తున్నామని ఇటీవల పేర్కొనడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐదు రోజులపాటు కొనసాగనున్న ఈ ప్రత్యేక సమావేశాలకు సంబంధించిన ఎజెండాను వెల్లడించకపోవడంపై ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే, మహిళా రిజర్వేషన్‌ బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి, జమిలి ఎన్నికలతోపాటు ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమావేశాల సమయంలోనే పార్లమెంటు పాత భవనం నుంచి కొత్త భవనానికి కార్యకలాపాలు మార్చవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *