ప్రభుత్వం కల్పిస్తున్న సహాయక చర్యలను సద్వినియోగం చేసుకోండి
మహిళా చైతన్యంతోనే రోడ్డు ప్రమాదాలు నివారణ
తెలుగు తేజం, విజయవాడ : ప్రభుత్వ సలహాలు, సూచనల మేరకు ప్రయాణ సమయాలలో మహిళలు తగు జాగ్రత్తలను పాటించినప్పుడే పూర్తి భద్రత లభిస్తుందని ఇందుకు మహిళలను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉందని ఉపరవాణా కమిషసరు యం. పురేంద్ర అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని గురువారం విజయవాడ డిటిసి కార్యాలయంలో ఉమెన్స్ సేఫ్టీ ఇన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంశం పై విద్యార్థినీలు మహిళలతో నిర్వహించిన సెమినార్‌కు డిటిసి యం పురేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు రైళ్లు, బస్సులు, టాక్సీలు వంటి రవాణా సౌకర్యాలు ద్వారా ప్రయాణాలు చేసే సమయంలో భద్రతా చర్యలను పూర్తిగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న సహాయక కార్యక్రమాలు సలహాలు సూచనలను ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు.
ముఖ్యంగా వాహన చోదకులు ప్రయాణిస్తున్నమహిళల నుండి వ్యక్తిగత వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తారాని అటువంటివాటికి అవకాశం ఇవ్వకుండా గోప్యతను పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అనుమానం వచ్చిన సందర్భాలలో సహాయం కొరకు ప్రభుత్వం కల్పించిన డయల్ 100, దిశ మొబైల్ యాప్ లను ఉపయోగించుకోవడం ద్వారా రాబోయే ప్రమాదాలను అరికట్ట గలుగుతారన్నారు. వీటిపై ప్రతి మహిళ అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ప్రయాణ సమయంలో మహిళలు వారు ప్రయాణిస్తున్న వివరాలను కుటుంబ సభ్యులకు సహచరులకు అందించాలని ఆయన సూచించారు. తద్వారా మొబైల్ యాప్ నుండి ప్రయాణిస్తున్న వాహన వివరాలను వారు ఎప్పటికప్పుడు గమనించి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారో లేదో తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రయాణిస్తున్న సమయంలో వాహనచోదకులు హెల్మెట్, సీటు బెల్టు వంటివి తప్పక ధరించేలా మహిళలు చర్యలు తీసుకోవాలని, వాటిని ధరించినప్పుడే ప్రయాణించేందుకు సుముఖతను వ్యక్తం చేయాలని డిటీసీ తెలిపారు. అలాగే గోడ్డు ప్రమాదాలపై మహిళల్లో అవగాహనను పెంపొందించినప్పుడు పూర్తి స్థాయిలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు.
నేటి ఆధునిక ప్రపంచంలో ఉద్యోగిణిలతోపాటు సాధారణ గృహిణిలు సైతం స్వయంగా వాహనాలను నడుపుతూ వారి దైనందిన పనుల్లో నిమగ్నం అవుతున్నారన్నారు. పురుషులతో పాటు సమానంగా వాహనాలను వినియోగిస్తున్న తరుణంలో మహిళల్లో కూడా ట్రాఫిక్ నిబంధనలతో పాటు హెల్మెట్, సీట్ బెల్స్ వంటి వాటిని తప్పక వినియోగించేలా చైతన్యవంతులను చేసి గోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రాణ నష్టాలను కూడా నివారించే అవకాశం ఉంటుందన్నారు. ఈ సదస్సులో రవాణాశాఖాధికారులు కె. రామ్ ప్రసాద్, ఏ. విజయసారథి, రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు. యం. రాజుబాబు, కార్యాలయ పరిపాలనాధికారులు హెచ్. శ్రీనివాసరావు, పి. కవిత, ప్రభాకరలింగం, మహిళా ఉద్యోగులు, పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన మహిళలు పాల్గొన్నారు.