రోడ్డు భద్రత కార్యక్రమాల్లో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి
మీ పై ఆశతో తల్లిదండ్రులు ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి-డిటిసి ఎం.పురేంద్ర
తెలుగు తేజం, విజయవాడ : కరోనా వ్యాధి భయంతో ప్రాణ రక్షణకు మాస్కుకి ఇస్తున్న ప్రాధాన్యత రోడ్డు ప్రమాద సమయంలో ప్రాణాలు కోల్పోకుండా హెల్మెట్ కు కూడా అంతే ప్రాధాన్యతనివ్వాలని డిటిసి ఎం. పురేంద్ర విద్యార్థులకు పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని స్థానిక వీఆర్ సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు కార్యక్రమంలో డిటిసి యం పురేంద్ర ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్ధనీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి లక్షలాది ప్రాణాలను బలిగొన్న విషయం ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. కరోనా వ్యాధి నుంచి రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించి కాలు గడప బయట పెడుతున్నామన్నారు. అయితే బయటకు వచ్చిన మనం రోడ్డు ప్రమాదాల్లో గురైనప్పుడు హెల్మెట్ లేకపోవడం వలన వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు గుర్తిస్తున్నప్పటికీ హెల్మెట్ ధరించాలన్న జిజ్ఞాస కలగకపోవడం శోచనీయమన్నారు. మనం మాస్కుకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో వాహనం నడిపేటప్పుడు హెల్మెటకు కూడా అంతే ప్రాధాన్యతనిచ్చినప్పుడు ప్రాణాపాయం నుండి బయటపడతామన్నారు. ముఖ్యంగా యువత వాహనం నడిపే సమయంలో ఏకాగ్రత అవసరం అన్నారు. ప్రముఖ క్రీడాకారులు, సినిమా నటులు, పారిశ్రామికవేత్తలకు చెందిన పిల్లలు రోడ్డు ప్రమాదంలో మరణించిన సంఘటనలు మనం తరచుగా చూస్తున్నానున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డు భద్రత పై అవగాహన కలిగించుకోవాలని, వాహనాలతో రోడ్డు పైకి వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్డు పైకి వచ్చే వ్యక్తులు వాహనం నడిపే సమయంలో హెల్మెట్ ధరించడం, నీట్ బెల్ట్ పెట్టుకోవడం సామాజిక బాధ్యతగా చేపట్టాలని పురేంద్ర తెలిపారు. మన పై ఆధారపడిన మన కుటుంబానికి రోడ్డు ప్రమాదాల వలన వేదనను మిగల్చకూడదన్న అవగాహన ఉంటే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగించుకోవాలని ఇందుకు సంబంధించిన జాగ్రత్తలు సామాజిక మాధ్యమాల్లో కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. నాసిరకం హెల్మెట్ వలన ప్రమాద సమయంలో మరింత ప్రమాద హేతువుగా ఆవి ఉంటున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు.
జనవరి 18 నుండి ఫిబ్రవరి 17 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని విద్యార్థులందరూ ఐక్యంగా రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే దుష్పరిణామాలను వివరించే చైతన్యవంతమైన కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వాలని డిటీసీ పిలుపునిచ్చారు. అనంతరం భద్రత నియమాలు పాటిస్తామని రోడ్డు ప్రమాదాలను అరికడదాం అని విద్యార్థిని విద్యార్థులతో డిటీసీ ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల డీన్ పాండురంగారావు మాట్లాడుతూ నియమాను పాటిస్తే ప్రమాదాలను నివారించినట్లేనని అన్నారు. లైసెన్స్ లేకుండా విద్యార్థులు అత్యుత్సాహంతో వేగంగా వాహనాలను నడిపి ప్రమాదాలు గురవుతున్నారన్నారు. ఈ విషయంలో తల్లి దండ్రులు వారి పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే పిల్లల మరణాలు సంభవించే కారణాల నుంచి వారికి వారే కాపాడుకున్న వారవుతారన్నారు. దయచేసి తల్లిదండ్రులు వారి వంతు బాధ్యత నిర్వహించాలని కోరుతున్నామన్నారు.
ఈ సమావేశంలో మోటారు వాహనాల తనిఖీ అధికారి జి.సంజీవ్ కుమార్, రవాణాశాఖ ఉద్యోగ సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం.రాజుబాబు. వీఆర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఇన్ చార్జి నరేంద్ర, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.