నూజివీడు : నూజివీడు పట్టణ పరిధిలోని దుకాణాలలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు విక్రయిస్తే జరిమానాలు తప్పవని మునిసిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు హెచ్చరించారు. పట్టణంలోని పలు దుకాణాలలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల విక్రయం పై గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగం, విక్రయాలను నిషేధించినట్లు స్పష్టం చేశారు. వ్యాపార కూడళ్ళలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను విక్రయిస్తే తొలి విడతగా జరిమానా విధించడం జరుగుతుందని, అయినప్పటికీ తీరు మారకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. పూర్వపు సాంప్రదాయం ప్రకారం గుడ్డ సంచులను వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగంతో చెత్త పేరుకుపోయి మూగజీవాలు సైతం అనారోగ్యానికి గురవుతున్నట్లు తెలిపారు. భూమిలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు కలిసేందుకు ఎక్కువ కాలం పట్టే నేపథ్యంలో పర్యావరణానికి ఎంతో కీడు జరుగుతుందన్నారు. ముందు తరాలకి చక్కని పర్యావరణాన్ని అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సానిటరీ సెక్రటరీ కిరణ్, ఇతర అధికారుల బృందం పాల్గొంది.