పోలీస్.. ఈ పేరు విన్నా.. యూనిఫామ్ లో ఉన్న వ్యక్తిని చూసినా.. నేటికీ జనాల్లో ఏదో బెదురు. మాట కలపాలంటే తెలియని భయం. ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతున్నా.. చొరవ మాత్రం రెండు వైపులా తక్కువే. అడపాదడపా అధికారులే ముందుకు వస్తున్నా, పరిస్థితుల్లో మార్పు అరకొరే. ప్రజల్లో ఖాకీలంటే ఉన్న భయాల్ని దూరం చేయటమే కాకుండా.. పోలీసులు అంటే ఆరాధానా భావాన్ని పెంపొందించే అధికారులు అరుదు. అలాంటి అరుదైన అధికారుల్లో ఒకరు నందిగామ గ్రామీణ సీఐ కె.సతీష్ గారు. జాతీయ యువజన దినోత్సవం, వివేకానంద జయంతి సందర్భంగా యువ అధికారిపై ప్రత్యేక కథనం.
తెలుగు తేజం, నందిగామ పశ్చిమ కృష్ణా రీజియన్ లో, తెలంగాణ సరిహద్దులకు సమీపంలో ఉండే ప్రాంతం. రాజకీయంగా జిల్లాలోనే ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. లారీ పరిశ్రమ, డ్రైవర్లు, కూలీలు.. ఇలా చెప్పుకుంటూ పోతే, ఆర్థికంగా, రాజకీయంగా చాలా సున్నితమైన ప్రాంతం. అలాంటి చోట పోలీస్ అంటే కరకు గట్టిన క్రౌర్యంపాళ్లు కొంచెం ఎక్కువ అని అంతా భావిస్తారు. వచ్చే ఆఫీసర్లు సైతం అదే బాణీని ఫాలో కావటం రివాజు. కె. సతీష్.. ఈ పేరు వింటే నందిగామ పరిసర ప్రాంతాల్లో ఓ రకమైన ఆరాధన. వృత్తిపరంగా పోలీస్ బాస్ అయినా.. ప్రజల సేవలో ప్రధాన సేవకుడిగా తనను తాను భావించుకుంటారు. వాళ్లకు ఏ కష్టం వచ్చినా.. ఓ స్వచ్ఛంద వ్యక్తిలా ముందుకు వస్తారు. గత ఏడాది కాలంగా యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై పోరాటంలో మన సీఐ సతీష్ ఫ్రంట్ లైన్ వారియర్ లా ముందుండి పోరాడుతున్నారు. పోలీస్ గా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. లాక్ డౌన్ సమయంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటంలో తన సిబ్బంది సాయంతో విశేషంగా కృషి చేశారు. విధుల నిర్వహణతోనే తన బాధ్యత తీరినట్లుగా ఆయన భావించలేదు. కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన అనేక నిరుపేద కుటుంబాలకు అండగా నిలబడ్డారు. తన వంతు సామాజిక బాధ్యతగా ఎందర్నో ఆదుకున్నారు. ఆంధ్రా తెలంగాణ ప్రాంతాలను కలిపే జాతీయ రహదారి ప్రాంతమైన నందిగామలో ప్రమాదాలు నిత్యకృత్యం. విధుల్లో భాగంగా ఇలాంటి వాటిని ఎన్నో చూస్తుంటారు పోలీస్ బాసులు. దారుణప్రమాదాలు జరిగినప్పుడు మహా అయితే ఓ నిట్టూర్పువిడుస్తారు. కానీ ఖాకీ యూనిఫామ్ వెనక దాగున్నది కరకు గుండెకాదు.. కరుణ ద్రవించే హృదయం అని చాటుకుంటున్నారు మన సీఐ సతీష్ గారు.. అనాథలుగా మారిన పిల్లల్ని, అవయవాలు కోల్పోయి అంగవైకల్యం బారినపడ్డ వాళ్లను.. వయోభేదంతో సంబంధం లేకుండా బాధితులందరికీ అండగా నిలబడ్డారు. తన దగ్గర పనిచేసే పోలీస్ ఇన్ ఫార్మర్ కు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటారు. అసువులు బాసిన పేదల కుటుంబాల్లో పిలల్లకు పెద్దన్నగా సాయం చేశారు. వారి చదువులు ఆగకుండా ఆర్థిక అండదండలు అందిస్తున్నారు.. సాయం చేస్తే తన కర్తవ్యం పూర్తైనట్లుగా ఏనాడు సీఐ సతీష్ అనుకోలేదు. తనలా సేవా దృక్పథం ఉండే అధికార్లను ప్రజలకు మరింత ఎక్కువగా అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని యువతకు పోలీసు ఉద్యోగాలపై అవగాహన కల్పిస్తున్నారు. వారి అనుమానాలు తీరుస్తూ.. భావిభారతాన్ని నిర్మించే కర్తవ్యాన్ని కూడా తన భుజాలకెత్తుకున్నారు… పేదరికం ఉన్న చోట క్రైమ్ సర్వసాధారణం. పర్యావసానాలు తెలీని పొరపాట్లు అనేక నేరాల వైపు మళ్లిస్తుంటాయి. అలాంటి అభాగ్యులకు చట్టాలు – కేసులు, వాటి నుంచి బయటపడే మార్గాల్ని సైతం సూచిస్తూ.. తన అడ్డాలో అడ్డదిడ్డమైన కార్యకలాపాల సంఖ్యను, క్రైమ్ రేటును గణనీయంగా తగ్గిస్తున్నారు సీఐ సతీష్. నిజమైన పోలీసింగ్ కు నిర్వచనం ఇచ్చే మిషన్ లో నిత్యం బిజీగా ఉంటున్నారు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఇలాంటి సేవా దృక్పథం ఉన్న అధికారుల్ని మిగతా వారు కూడా ఆదర్శంగా తీసుకుంటారని ఆశిద్ధాం.